ట్రిపుల్‌ఐటీలో వరుస ఘటనలపై అధికారుల మౌనం మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం అంతర్గత విచారణ ప్రారంభం! రెండు రోజులైనా తెలియని కారణం
భైంసా: బాసర ఆర్జీయూకేటీలో బుధవారం ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఘటన జరిగిన వెంటనే విద్యార్థినిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన అధికారులు, అనంతరం అంతర్గత విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఆ విచారణలో ఏమి తేలింది, అసలు ఎలా జరిగింది, ఏ పరిస్థితుల్లో ఈ చర్యకు పాల్పడింది వంటి అంశాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వడం లేదు. ఏ భవనం నుంచి, ఏ అంతస్తు నుంచి దూకిందన్న ప్రాథమిక వివరాలు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. క్యాంపస్‌లో ఈ ఘటన బయటకు రాకపోవడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.
వరుస ఘటనలు
గతంలో క్యాంపస్‌లో విద్యార్థుల ఆత్మహత్యలు, అనారోగ్య ఘటనలు, మెస్ సమస్యలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భాల్లో పూర్తి వివరాలు బయటకు రాలేదనే విమర్శలు ఉన్నాయి. ఘటనలపై వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు.
తల్లిదండ్రుల ఆందోళన
వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ పిల్లలను ఉన్నత విద్య కోసం ఆర్జీయూకేటీకి పంపించిన తల్లిదండ్రులు ప్రతి ఘటన తర్వాత ఆందోళన చెందుతున్నారు. ఒక ఘటన జరిగిందని తెలిసినా, అసలు పరిస్థితి ఏమిటో తెలుసుకునే అవకాశం లేకపోవడం వారిని మరింత కలవరపెడుతోంది. ఫోన్ చేస్తే అధికారులు స్పందించడం లేదని, మీడియాకు సరైన సమాచారం ఇవ్వడం లేదని వాపోతున్నారు.
తాజాగా జరిగిన ఘటనకు సంబంధించి ఏమి జరిగిందో తెలియని పరిస్థితి. వాస్తవానికి అధికారులు నిజాలు చెప్పకపోవడం ఏంటని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల మానసిక పరిస్థితి, కౌన్సెలింగ్ వ్యవస్థ, హాస్టళ్లలో పర్యవేక్షణ తదితర అంశాలపై సమగ్ర సమీక్ష అవసరమని పేర్కొంటున్నారు. ఆర్జీయూకేటీ యాజమాన్యం ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించి, విద్యార్థుల భద్రతపై తీసుకుంటున్న చర్యలను బహిరంగంగా ప్రకటించాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు డిమాండ్
చేస్తున్నాయి.


