కోటపల్లి: మండలంలోని వెంచపల్లి సమీపంలోని ప్రాణహిత నదిలో స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా యువకుడు గల్లంతయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని వెంచపల్లి గ్రామానికి చెందిన పబ్బ తిరుపతి–భాగ్య దంపతుల కుమారుడు అజయ్‌గౌడ్(24) గురువారం మధ్యాహ్నం ప్రాణహిత నదిలో స్నానం చేసేందుకు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. నదిలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా అజయ్‌గౌడ్ గల్లంతయ్యాడు. స్నేహితులంతా వెతికినా కనిపించకపోవడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సీఐ కృష్ణ, ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని గజఈతగాళ్లతో రెండు, మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దడంగాతో నదిలో గాలించగా ఆచూకీ లభ్యం కాలేదు. చీకటి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. కాగా, అజయ్‌గౌడ్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. వేసవి సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చాడని బంధువులు తెలిపారు. ఇప్పుడే వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన కుమారుడు నదిలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మాజీ ఎంపీటీసీ తిరుపతి, మాజీ సర్పంచ్ గట్టు లక్ష్మణ్‌గౌడ్, పడాల సతీశ్‌లు కుటుంబ సభ్యులను ఓదార్చారు.


