కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలి

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

● రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న

నేరడిగొండ: కౌలు రైతులపై రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడి, గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వ పథకాలు అందించాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్‌ చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన కౌలు రైతులతో గురువారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం 2011 భూ అధీకృత వాస్తవ సాగుదారుల చట్టాన్ని అమలు చేసి రుణ అర్హత కార్డులు జారీ చేయాలని కోరారు. తద్వారా భూ యజమానులతో సంబంధం లేకుండా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడంతో పాటు బ్యాంకు రుణాలు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సుమారు 28,763 మంది కౌలు రైతులు ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని, ప్రతి ఏడాది ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల్లో కౌలు రైతులే అధికంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట రోహిదాస్‌, చందర్‌, పరుశురాం, అనసూయ, నీలాబాయి, కౌలు రైతులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement