నకిలీ పత్తి విత్తన వ్యాపారిపై పీడీయాక్టు | - | Sakshi
Sakshi News home page

నకిలీ పత్తి విత్తన వ్యాపారిపై పీడీయాక్టు

Jun 17 2026 11:47 PM | Updated on Jun 17 2026 11:47 PM

బెల్లంపల్లి: రైతులకు నకిలీ పత్తి విత్తనాలు అంటగడుతున్న ఓ వ్యాపారిపై పోలీసులు పీడీయాక్టు చట్టాన్ని ప్రయోగించారు. రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా బుధవారం వివరాలు వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వూస సుబ్బారావు కమిషనరేట్‌ పరిధిలోని తాండూర్‌, భీమిని, భీమారం, బెల్లంపల్లి, నెన్నెల, చెన్నూర్‌ మండలాల్లో ఏజెంట్లను నియమించుకుని నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నాడు. ఈ ఏడాది అతనిపై రెండు పీడీయాక్టు కేసులు నమోదయ్యాయి. తాండూర్‌, భీమారం పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోని రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా చేసినట్లు రూఢీ కావడంతో నిందితుడిపై పీడీయాక్టు అమలు చేస్తూ సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. తాండూర్‌ సీఐ ఎన్‌.దేవయ్య, ఎస్సై ప్రసాద్‌ ఉత్తర్వుల ప్రతిని అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు. 2021 నుంచి 2025 వరకు నకిలీ పత్తి విత్తనాల రవాణా, నిల్వ, విక్రయాలకు సంబంధించిన అనేక క్రిమినల్‌ కేసుల్లో పాలు పంచుకున్నట్లు సీపీ ప్రకటించారు. 2021 జూన్‌ 10న సుబ్బారావుపై పీడీయాక్టు అమలు చేయగా ప్రభుత్వం ధృవీకరించిందని తెలిపారు. అయినప్పటికీ తన వైఖరి మార్చుకోలేదన్నారు. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల పరిధిలో 9 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. నిందితుడిపై పీడీయాక్టు అమలుకు కృషి చేసిన బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్‌, తాండూర్‌ సీఐ దేవయ్య, ఎస్సై ప్రసాద్‌ను సీపీ అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement