భైంసా: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర రూపురేఖలు మారనున్నాయి. ఈ నెల 6న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి బాసరలో రూ.225 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. కుంభమేళా తరహాలో పుష్కరాలు నిర్వహిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. బాసర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డితో పాటు పలువురు వెల్లడించారు.
రంగంలోకి ఈఎన్‌సీ బృందం..
హైదరాబాద్ నుంచి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) జోగారెడ్డి బుధవారం బాసర చేరుకున్నారు. ఇంజినీర్ల బృందంతో కలిసి గోదావరి నదీతీరాన్ని పరిశీలించారు. స్నానఘట్టాలు, భక్తుల క్యూలైన్లు పరిశీలించారు. చేపట్టాల్సిన పూర్తిస్థాయి పనులపై ఇంజినీర్ల బృందంతో మూడు గంటలపాటు చర్చించారు. గోదావరి నదితీరంలో తాత్కాలికంగా చేపట్టబోయే పనులు, శాశ్వత నిర్మాణాలపై ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో అధికారులు..
సీఎం శంకుస్థాపన తర్వాత అధికారుల బృందం బుధవారం క్షేత్రస్థాయిలో బాసరను సందర్శించింది. ఈఎన్‌సీ జోగారెడ్డి, ఆదిలాబాద్ పంచాయతీ రాజ్ ఎస్‌ఈ రాథోడ్ శంకర్, పీఆర్ డీఈఈ వేణుగోపాల్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ వెంకటవేణు, ఆర్‌అండ్‌బీ ఈఈ సుభాష్, ఇరిగేషన్ ఈఈ అనిల్, బాసర ఆలయ ఏఈవో శ్రీనివాస్‌తో పాటు పలు శాఖల అధికారులంతా కలిసి ఏర్పాట్లపై చర్చించారు. అన్ని శాఖల అధికారులు బాసర పనులపై దృష్టిపెడుతున్నారు. ఈవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. శాఖల వారీగా చేపట్టబోయే పనులపై చర్చించారు.
పనులపై ప్రభుత్వం దృష్టి
బాసర పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈఎన్‌సీ జోగారెడ్డి తెలిపారు. పలు శాఖల అధికారులు తయారు చేసిన ప్రణాళికలను ఆయనకు వివరించారు. పనుల అంచనాల్లో పారదర్శకత ఉండాలని టెక్నికల్ స్టాండర్స్‌లో ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని స్పష్టం చేశారు. బాసరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పనుల్లో నాణ్యత లోపించకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
భక్తులకు ఇబ్బందులు ఉండవు
బాసర అభివృద్ధిపై అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించా. ఆలయ పునర్నిర్మాణం కోసం సీఎం రేవంత్‌రెడ్డి రూ.225 కోట్ల పనులకు భూమిపూజ చేశారు. రానున్న రోజుల్లో బాసర వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పటికే బాసరలో ఇంజనీర్ల బృందం పర్యటించింది. చేపట్టాల్సిన పనులపై అన్నిశాఖల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పనులు పూర్తయితే బాసర రూపురేఖలు మారనున్నాయి.
– పవార్ రామారావు పటేల్,
ఎమ్మెల్యే, ముధోల్


