కాసిపేట: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గంగారాం తెలిపిన వివరాల మేరకు దేవాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పూలందేవి వాడకు చెందిన కొత్తకాటు మనోజ్‌కుమార్ (27) కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 8న అతిగా మద్యం సేవించి ఇంటికి రావడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై అర్ధరాత్రి మామిడిచెట్టుకు ఉరేసుకున్నాడు. తెల్ల వారు జామున గమనించిన కుటుంబ సభ్యులు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
బస్టాండులో పర్సు పోగొట్టుకున్న మహిళ
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం ఓ ప్రయాణికురాలు పర్సు పోయిందని రోదించిన తీరు ప్రయాణికులను కలచి వేసింది. ఆసిఫాబాద్ జిల్లా బురుగుపల్లికి చెందిన వనిత పనినిమిత్తం మంచిర్యాలకు వచ్చి ఇంటికి వెళ్లేందుకు మంచిర్యాల బస్టాండ్‌లో ఆసిఫాబాద్ వెళ్లే బస్సు ఎక్కేక్రమంలో ఆమె పర్సు కిందపడిపోయిది. బస్సు ఎక్కిన తర్వాత తనవద్ద ఉన్న పర్స్ కనిపించక పోవడంతో కిందకు దిగి రోదించింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ పుటేజిని పరిశీలించగా ఓ వృద్ధురాలు పర్సును తీసుకొని రోడ్డుపైకి వెళ్లిపోయినట్లు గుర్తించారు. పర్సులో అరతులం బంగారు చైన్ ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. ఘటనపై స్థానిక సీఐని వివరణ కోరగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసిన ఎమ్మెల్యే
మందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఫిబ్రవరి 17న జరిగిన అల్లర్ల ఘటనలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ మంజూరైంది. దీంతో ఎమ్మెల్యే కోవ లక్ష్మి సోమవారం రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ష్యూరిటీ సబ్‌మిట్ చేసి సంతకం చేసి వెళ్లారు.


