మరో ఎనిమిదేళ్లు ప్రభుత్వం మనదే
రామకృష్ణాపూర్: రాబోయే మూడు సంవత్సరాలతోపాటు మరో ఐదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతీ గడపకు తీసుకెళ్లి క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి జూపల్లి హాజరై మాట్లాడారు. ప్రజల్లో ఆదరణ, గెలిచే సత్తా ఉన్న వారికే కౌన్సిలర్ టికెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. టికెట్ రాని వారు నిరాశ పడొద్దని భవిష్యత్‌లో వారికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, పల్లెరాజు, అబ్దుల్‌అజీజ్, గాండ్ల సమ్మ య్య, వొడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


