● బల్దియాల్లో అమలుకు నోచుకోని వైనం ● నిర్లక్ష్యంగా వ్యవ
‘ప్లాస్టిక్’పై నిషేధమేది..!
మంచిర్యాలటౌన్: ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించాలన్న జాతీయ కాలుష్య నియంత్రణ మండలి సూచనను అన్ని మున్సిపాల్టీల్లో అమల్లోకి తెచ్చినా అమలు గగనంగా మారింది. గత ఏడాది ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై బల్దియాల్లో అధికారులు తనిఖీలు చేపట్టడం, జరిమానాలు విధించడం వల్ల కొంతవరకు వినియోగం తగ్గింది. గత కొంతకాలంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్లాస్టిక్ నిషేధంపై అధికారుల పర్యవేక్షణ లోపించి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రోజు రో జుకు వినియోగం పెరిగిపోయి నగరంలోని వీధులు, చెత్తకుప్పల్లో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు దర్శనమి స్తున్నాయి. పశువులు ప్లాస్టిక్ కవర్లు తిని మృత్యువా త పడుతుండగా, పర్యావరణ కాలుష్యానికి ప్లాస్టిక్ కవర్లు కారకమవుతున్నాయి. కనీస తనిఖీలు చేపట్టకపోవడం, జరిమానాలు విధించకపోవడం వల్ల వినియోగం పెరిగిపోతోంది. ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారుల సమావేశాలు నిర్వహించి వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలూ చేయడం లేదు. ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయం చూకపోవడంతోనూ జిల్లాలో వినియోగం యథేచ్ఛగా సాగుతోంది.
చర్యలేవి..?
కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పాలిథిన్‌ను పూర్తిగా నిషేధించారు. 120మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్నవి, ఒకసారి వాడినవి ఉన్నా, నిల్వ ఉంచినా, విక్రయించినా, ఉపయోగించినా పర్యావరణ పరిరక్షణ చట్టం(1986) ప్రకారం సీడీఎంఏ హైదరాబాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సామగ్రి జప్తు, రూ.5వేల నుంచి రూ.10వేల వరకు జరిమానా, లైసెన్స్ రద్దుతోపాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. నిషేధం అమలుకు ముందు నుంచే వ్యాపారులు, ప్లాస్టిక్ కవర్లు విక్రయించే వారికి నిషేధంపై మున్సిపల్ అధికారులు వివరించి ప్రజల్లోనూ మార్పు తెచ్చేందుకు చేతి సంచితోనే కూరగాయల మార్కెట్‌కు రావాలని, ప్లాస్టిక్ నిషేధం ఉందని, ఎవరూ వినియోగించినా మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ కనిపించినా వెంటనే మున్సిపల్ సిబ్బంది సీజ్ చేశారు. ఇది ఏడాది క్రితం వరకే చేసి ఆ తర్వాత అధికారులు ప్లాస్టిక్ కవర్లపై పట్టించుకోవడమే మానేశారు. దీంతో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించిన ప్రజలు తిరిగి ప్రారంభించారు. బట్ట సంచులను వాడిన వారి చేతుల్లో ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తున్నాయి. నిరంతర తనిఖీలు చేపట్టకపోవడంతో బట్ట సంచుల స్థానంలో తిరిగి ప్లాస్టిక్ కవర్లు అందుబాటులోకి వచ్చి వినియోగం విరివిగా మారింది.
చెత్తకుప్పల్లో..
జిల్లాలోని మున్సిపాలిటీల్లో వేసే చెత్తకుప్పల్లో అధిక భాగం ప్లాస్టిక్ కవర్లే కనిపిస్తున్నాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో ప్రతీరోజు దాదాపుగా 150 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడితే అందులో నాలుగోవంతు ప్లాస్టిక్ కవర్లే ఉంటున్నాయి. ఇళ్లల్లో నుంచి వెలువడే చెత్తలో తడి, పొడి చెత్తను ప్లాస్టిక్ కవర్లలోనే వేసి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అందిస్తున్నారు. దుకాణాల్లోనూ ప్లాస్టిక్ కవర్లు చెత్తలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లలో వేస్తున్న చెత్తను కాలనీల్లోని చెత్త వేసే ప్రాంతాల్లో పడేయడంతో, ఏ కాలనీలో చూసినా చెత్తతోపాటు ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నాయి. జిల్లాలో నిత్యం దాదాపు 95 వేలకు పైగా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారని అంచనా. పశువులు రోడ్డు పక్కన ఉండే చెత్త, అందులోని ప్లాస్టిక్ కవర్లను తింటూ జీర్ణం చేసుకోలేక, అందులోని రసాయనాలు శరీరంలోకి వెళ్లి అనారోగ్యం బారిన పడుతున్నాయి.


