సంక్రాంతికి ‘గూడెం ఎత్తిపోతల’ నీరు
దండేపల్లి: మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం ద్వారా దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని కడెం ఆయకట్టు పరిధిలో డీ–30 నుంచి 42వరకు ప్రతియేటా సాగునీరందిస్తున్నారు. ఈసారి యాసంగి సీజన్ సాగుకు సంబంధించి సంక్రాంతి పండుగ నుంచి నీటి విడుదలకు అధికారులు చర్యలు చేపట్టారు. 2021, 2022లో గోదావరి వరద నీటిలో కంట్రోల్‌ప్యానల్ గది మునిగిపోవడం, కొంత సామగ్రి పాడవడం తెలిసిందే. ఆ సమయంలో మరమ్మతులు చేయించారు. కంట్రోల్ ప్యానల్ వరద నీటిలో మునిగి పోకుండా ఉండేందుకు ఎత్తయిన ప్రదేశంలో రూ.1.59కోట్లతో కొత్తగా గది నిర్మించారు. ప్రస్తుత గదిలోని సామగ్రిని అందులోకి మారుస్తున్నారు. శరవేగంగా సాగుతున్న పనులన్నీ సంక్రాంతి వరకు పూర్తి చేసి నీటి విడుదలకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. పనులు పూర్తవగానే ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ఆదేశాల మేరకు నీటి విడుదల తేదీని ప్రకటిస్తామని ఇరిగేషన్ డీఈ దశరథ్ తెలిపారు.


