ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చా
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన అభివృద్ధి పనుల హామీలు నెరవేర్చానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. సోమవారం ఆయన స్థానిక ఐబీ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రూ.255కోట్లతో కరకట్ట పనులు ప్రారంభించామని తెలిపారు. దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ. 74.40 కోట్లు విడుదలయ్యాయని, వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామని అన్నారు. సూపర్ స్పెషా లిటీ ఆసుపత్రిలో భవిష్యత్‌లో పడకలు పెంచుకునేలా నిర్మిస్తున్నామని అన్నారు. కాలేజీరోడ్డులో 350 పడకలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పనులు జరుగుతుండగా, పాత ఆసుపత్రిని కూల్చి 100 పడకలతో నూతన ఆసుపత్రి నిర్మాణం చేపడుతామని తెలిపారు. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతిపక్ష నాయకులు నడిపెల్లి దివాకర్‌రావు, రఘునాథ్ వెరబెల్లిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వీల్ చైర్‌లో పర్యటన
ప్రేమ్‌సాగర్‌రావు దాదాపుగా గత నాలుగు నెలలుగా అనారోగ్యంగా ఉండి చికిత్స పొందారు. ఈ నెల 22న మంచిర్యాలకు వచ్చిన ఆయన కాలు కింద పెట్టలేని పరిస్థితుల్లో వీల్‌చైర్‌లో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఆర్టీఏ కార్యాలయానికి..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వేంపల్లిలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి(ఆర్టీఏ) ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు విచ్చేశారు. ఇటీవల కొనుగోలు చేసిన నూతన టోయోట వెల్‌ఫైర్ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. కాగా, 0001 నంబరును ముందస్తుగా రూ.50 వేల ఫీజుతో బుకింగ్ చేసుకుని దక్కించుకున్నారు. దాదాపు రూ.కోటిన్నర విలువైన ఈ వాహనం ఇక్కడి ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కావడం కూడా ఒక విశేషమే.


