గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం
సారంగపూర్: రెండు రోజుల క్రితం స్వర్ణ ప్రాజెక్టులో గల్లంతైన బాలుని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని లింగాపూర్‌కు చెందిన గెడెం కార్తీక్ (16) స్వర్ణ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో గల్లంతైన విషయం తెలిసిందే. తన కుమారుడు రెండు రోజులుగా కనిపించడం లేదని బాలుని తండ్రి అర్జున్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కార్తీక్‌తో కలిసి తిరిగిన పంద్రం గంగాప్రసాద్, మరో బాలుడిని విచారించగా సదరు యువకుడు ప్రమాదవశాత్తు స్వర్ణ ప్రాజెక్టులో పడిపోయాడని తెలిపారు. గజ ఈతగాళ్లతో ప్రాజెక్టులో గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం మృతదేహం లభ్యమైంది. మృతిపై అనుమానం వచ్చిన పోలీసులు పంద్రం గంగాప్రసాద్, మరో బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు వెల్లడించారు. ఈ నెల 25న మృతుని మేనబావ అయిన గంగాప్రసాద్ మరో బాలుడితో కలిసి కార్తీక్‌ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని లింగాపూర్ తండావైపు వెళ్లి మద్యం సేవించారు. తిరిగి వస్తుండగా లింగాపూర్ సమీపంలో గల వంతెన వద్ద ఆగారు. ఈ క్రమంలో కార్తీక్‌కు ఈత రాదని చెప్పినా వినిపించుకోకుండా నీటిలోకి తోసివేశారు. దీంతో ఊపిరాడక మృతి చెందాడని ఎస్సై తెలిపారు. గంగాప్రసాద్‌ను కోర్టులో, మరో మైనర్ బాలుడిని జువైనల్ కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.


