జాతర సమీపిస్తున్నా.. జాప్యమే!
జనవరి 18న నాగోబా మహాపూజ ఖరారు కాని కోఆర్డినేషన్ సమావేశం అధ్వాన రోడ్లు.. ప్రారంభానికి నోచుకోని పనులు
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర జనవరి 18న మెస్రం వంశీయుల మహా పూజతో ప్రారంభం కానుంది. మరో 20 రోజులు మాత్రమే ఉంది. అయితే జాతర నిర్వహణ, ఏర్పాట్లపై నిర్వహించాల్సిన అధికారుల సమన్వయ సమావేశం జాడ కానరావడం లేదు. మరోవైపు మెస్రం వంశీయులు ఈ నెల 23న ప్రారంభించిన ప్రచార రథం నేటితో ముగియనుంది. 30వ తేదీన గంగాజలయాత్ర కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి జాతర పనులు త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మెస్రం వంశీయులు కోరుతున్నారు.
భక్తులకు దారి కష్టాలు తప్పవా..
మండలంలోని ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు మూడు కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు నిధులు మంజూరైనా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అయితే రోడ్డుకు ఇరువైపులా చెట్ల తొలగింపు మాత్రమే చేస్తామని, విస్తరణ పనులు జాతర తరువాత నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లతో తరలివస్తారు. అయితే హర్కపూర్ చౌక్ నుంచి కేస్లాపూర్ వరకు ఉన్న మట్టి రోడ్డుతో పాటు కేస్లాపూర్ నుంచి దస్నాపూర్ గ్రామం వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా మారింది. ఏటా భక్తులకు ఈ మార్గంలో ఇక్కట్లు తప్పడం లేదు. సమస్యను గతేడాది కలెక్టర్ రాజర్షిషా దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికీ అవే గుంతల రోడ్లు దర్శనిమిస్తుండడం గమనార్హం. అలానే కేస్లాపూర్‌కు అనుబంధంగా ఉన్న మెండపల్లి రోడ్డుతో పాటు మల్లాపూర్, ధర్మసాగర్ బైపాస్ రోడ్లు కూడా అధ్వానంగా మారాయి.
ప్రారంభం కాని ఏర్పాట్లు
పుష్యమాస అమావాస్య పురష్కరించుకుని జనవరి 18న మెస్రం వంశీయుల మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం కానుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి మెస్రం వంశీయులతో పాటు భక్తులు భారీగా తరలివస్తారు. జాతరకు మూడు వారాలే సమయం ఉంది. ఏర్పాట్లపై ఆయా శాఖలతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించాల్సిన ఉన్నతాధికారులు ఇంకా దృష్టి సారించకపోవడం గమనార్హం.


