విత్తనం.. కీలకం
చెన్నూర్‌రూరల్: ఖరీఫ్ ముగిసి యాసంగి సీజన్ మొదలైన క్రమంలో రైతులు సాగులో తగిన మెళకువలు పాటించాలి. విత్తనాలు, భూసారం, సాగునీరు, ఎరువుల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సాగులో ప్రథమంగా విత్తన ఎంపికే చాలా కీలకం. సాగు ప్రారంభం నుంచే వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. యాసంగి సాగుపై చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసాద్ చేసిన సూచనలు..
సీలు, ధ్రువీకరణ తప్పనిసరి..
బోరుబావులు, నీటి సౌకర్యమున్న రైతులు ప్రస్తు తం రబీలో వరి నార్లు పోసుకునేందుకు సిద్ధపడుతున్నారు. అయితే విత్తనాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సరిగా సీలు, సంబంధిత అధికారుల ధ్రువీకరణ లేని విత్తన బస్తాలు కొనవద్దు. ఎలాంటి ధ్రువీకరణ లేని విత్తన బస్తాలు అమ్మితే దుకాణాదారులపై వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి. లేదంటే సమాచారమైనా ఇవ్వాలి. అనుమతులు లేని విక్రయదారుల నుంచి విత్తనాలు కొనుగోలు చేయవద్దు. విక్రయదారుని మాటలకు మోసపోవద్దు. విత్తనాలను ఎంచుకునే సమయంలో అవి మన ప్రాంతానికి అనువైనవా.. లేదా తెలుసుకోవాలి. చీడ, పీడలను తట్టుకునే విత్తనాలు కొనుగోలు చేయడం ఉత్తమం. వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి వారి సూచన మేరకు సాగు ప్రక్రియ చేపడితే మంచి ఫలితాలుంటాయి.
విత్తనశుద్ధి తప్పనిసరి
విత్తనాలను 5శాతం ఉప్పు ద్రావణంలో వేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉంచితే తాలు గింజలు నీటిపై తేలుతాయి. నీటిపై తేలి ఉన్న వాటిని తీసివేసి మునిగి ఉన్న మంచి విత్తనాలను రెండు, మూడుసార్లు మంచి నీటిలో కడిగి నీడలో ఆరబెట్టాలి. విత్తనాలు బాగా మొలకెత్తే శక్తిని కలిగి ఉండాలి. అంటే 80 వరకు గింజలు మొలకెత్తాలి. విత్తనశుద్ధికి తగు మోతాదులో మాత్రమే మందు విని యోగించాలి. మందు మోతాదు పెరిగితే మొలక శాతం దెబ్బతింటుంది. మరీ తక్కువైనప్పుడు మందు అసలు పని చేయదు. విత్తనాన్ని 8–10 శాతం ఆరనిచ్చి విత్తనశుద్ధి చేయాలి. ఎక్కువ పదును ఉంటే మందులు విత్తనాన్ని పాడు చేస్తాయి. విత్తనశుద్ధి చేసేటప్పుడు విత్తనం పైపొర దెబ్బ తినకుండా జా గ్రత్త వహించాలి. రసాయనాలు కలిపిన విత్తనాల ను జాగ్రత్తగా భద్రపరచాలి. నారు పోసుకునే ముందు మడులను బాగా కలియదున్ని గత పంటల వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి. నీటి వసతి ఉంటేనే రబీలో వరి సాగు చేయడం మంచిది. లేదంటే ఆరుతడి పంటలు సాగు చేసుకోవడం ఉత్తమం.
విత్తనం.. కీలకం


