సత్ఫలితాలిస్తున్న రోడ్ సేఫ్టీ క్లబ్
కై లాస్‌నగర్(బేల): జిల్లాలో రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం తగ్గించాలనే లక్ష్యంతో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆలోచనతో ప్రారంభించిన రోడ్ సేఫ్టీ క్లబ్ మంచి ఫలితాలను ఇస్తోంది. బేల మండలం సిర్సన్న గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులు సకాలంలో స్పందించి ద్విచక్ర వాహనదారుడి ప్రాణాలను కాపాడారు. బేల మండలం డోప్టాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆదిలాబాద్‌లో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సిర్సన్న గ్రామ సమీపంలో అడవి పంది అడ్డుగా రావడంతో ప్రమాదానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న రోడ్ సేఫ్టీ క్లబ్ సిర్సన్న గ్రామ యువత వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని జిల్లా పోలీసుల ద్వారా అందజేసిన ఫస్ట్‌ఎయిడ్ కిట్ వినియోగించి బాధితుడికి ప్రఽథమ చికిత్స అందించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఎల్.ప్రవీణ్ ఘటన స్థలానికి చేరుకుని 108లో బాధితుడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ బాధితుడికి గాయాలు కావడంతో, ముందుగా శిక్షణ పొందిన రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన ప్రథమ చికిత్స అందించడం విశేషం. ప్రస్తుతం బాధితుడికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ఘటనపై స్పందించిన ఎస్పీ రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యుల సేవాభావాన్ని ప్రత్యేకంగా అభినందించారు.


