‘స్వర్ణ’లో బాలుడి గల్లంతు?
సారంగపూర్: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన గెడెం కార్తీక్(16) శుక్రవారం నుంచి కనిపించడం లేదు. ఆచూకీ కోసం పోలీసులు స్వర్ణ ప్రాజెక్టులో గజ ఈతగాళ్లు శనివారం తెల్లవారుజాము నుంచి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. కార్తీక్ స్వర్ణ గ్రామంలోని ఓవ్యక్తి వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా పనికి వెళ్లడం లేదు. శుక్రవారం మిత్రులతో కలిసి స్వర్ణ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వైపు నిర్మల్–మహారాష్ట్ర ప్రధాన రహదారిపై గల వంతెన సమీపంలో తిరిగాడు. రాత్రి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం గాలించినా దొరకకపోవడంతో తండ్రి గెడెం అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడితో కలిసి తిరిగిన మిత్రులను విచారణ చేశారు. కార్తీక్ స్వర్ణ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో పడిపోయాడని తెలుపడంతో స్థానిక మత్స్యకారుల సహకారంతో ప్రాజెక్టులో గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యంకాకపోవడంతో సోన్ మండలం గాంధీనగర్‌కు చెందిన గజ ఈతగాళ్లను రప్పించి చీకటి పడేవరకు గాలింపు చేపట్టారు. అయినా శనివారం ఆచూకీ లభించలేదు.


