ముల్లె, మూట సర్దుకుని..
వేమనపల్లి: మెదటి కోడి కూయగానే ఆ ఊళ్లన్నీ నిద్రలేచాయి. ఆయా గ్రామాల గిరిజనులు ఇంటిముందు అలుకు చల్లుకున్నారు. అన్నం, కూర వండుకున్నారు. ముల్లె, మూట సర్దుకున్నారు. గొడ్డు, గోదా, కోడి పిల్లలు పైలం.. అని ఇంటి పెద్దలకు జాగ్రత్తలు చెప్పారు. మరికొందరు తలుపులు లేని గుడిసెలకు తడకలు అడ్డంపెట్టారు. అంతా కలిసి ముల్లె, మూటలతో ఇళ్ల నుంచి బయలుదేరారు. వీరి కోసమే ఇటుక బట్టీల యజమానులు పంపించిన వాహనాల్లో ముల్లె, మూటలతో ఎక్కారు. ఇవీ.. వేమనపల్లి మండలంలోని రాజారం, గొర్లపల్లి, కొత్తకాలనీ, ముల్కలపేట ఎస్టీ కాలనీల్లో శుక్రవారం ఉదయం కనిపించిన దృశ్యాలు.. సుమారు 280 కుటుంబాలు ఊర్లొదిలి వలస వెళ్లారు.
పనులు లేని సమయంలో..
గ్రామాల్లో పనులు లేని సమయంలో గిరిజన కుటుంబాలు మంచిర్యాల, జగిత్యాల తదితర ప్రాంతాల్లోని ఇటుక బట్టీల యజమానుల వద్ద డబ్బులు తెచ్చుకుంటారు. కొందరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సూరారం, మాహదేవ్‌పూర్ ప్రాంతాలకు పత్తి, మిర్చి ఏరేందుకు వలసవెళ్తారు. సుమారు నాలుగు నెలలు ఇటుక బట్టీలు, మిర్చితోటల్లో ఉండి పనులు చేస్తారు. వలస వెళ్లటంతో ఇప్పటికే రాజారం గ్రామం ఖాళీ అయ్యింది. వృద్ధులు మాత్రమే ఇంటి వద్ద ఉన్నారు. వలసలతో ఆయా గ్రామాలు బోసిపోయాయి.


