వేఽధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య?
బోథ్: సొనాల మండలం సూర్యనగర్ గ్రామానికి చెందిన జాదవ్ స్రవంతి (30) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె మృతికి గ్రామానికి చెందిన జాధవ్ కృష్ణనే కారణమని బంధువులు ఆరోపిస్తూ బోథ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడైన మృతురాలి సోదరుడు రాథోడ్ నితిన్ తెలిపిన వివరాల ప్రకారం.. బజార్‌హత్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామానికి చెందిన స్రవంతికి సొనాల మండలంలోని సూర్యనగర్ గ్రామానికి చెందిన జాధవ్ చరణ్‌కుమార్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడున్నారు. అయితే, రెండేళ్లుగా స్రవంతిపై ఆమె చిన్నమామ కుమారుడైన జాదవ్ కృష్ణ తరచూ వేధింపులకు గురిచేసేవాడు. తనను పెళ్లి చేసుకోవాలని, భర్తను వదిలి రావాలని స్రవంతిని నిరంతరం వేధింపులకు గురిచేసేవాడని నితిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై మూడు నెలల క్రితం జాధవ్ కృష్ణకు నచ్చజెప్పినా అతనిలో మార్పు లేదని తెలిపారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 24న కృష్ణ ఆమెను వేధించడంతో తట్టుకోలేక స్రవంతి పురుగుల మందు తాగిందని నితిన్ పేర్కొన్నాడు. ఆ విషయాన్ని కృష్ణనే తమకు ఫోన్ ద్వారా తెలిపాడని వివరించారు. అయితే బుధవారం సాయంత్రం బంధువులు బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తన అక్క మరణానికి కారణమైన జాదవ్ కృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని నితిన్ ఫిర్యాదు చేశాడు. కాగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీసాయి తెలిపారు.


