నగరంలోని ఉద్యోగులకు 17శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు 17శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చేలా చూడాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావును టీఎన్జీవోస్ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం ఆయనను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ సభ్యులు మాట్లాడుతూ గతంలో మంచిర్యాల, నస్పూరు మున్సిపాలిటీలుగా ఉండగా, హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను కలిపి మంచిర్యాల కార్పొరేషన్‌గా మార్చి జనవరి నాటికి ఏడాది పూర్తవుతుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడి 17శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తించేలా చూడాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘ కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, హౌజింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రావణ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్ పాల్గొన్నారు.


