‘గిరి’ వసతి ఆలస్యం
తాండూర్: ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే గిరిజన విద్యార్థుల కోసం సకల హంగులతో చేపట్టిన అధునాతన హాస్టల్ భవన నిర్మాణం ఆలస్యంగా మొదలైంది. కేంద్ర ప్రభుత్వం రూ.2.70 కోట్లు మంజూరు చేయగా భవన నిర్మాణం సాగుతోంది. మండలంలోని తంగళ్లపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో నూతన వసతిగృహ నిర్మాణ పనులు ఇటీవల చేపట్టారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించి స్వేచ్ఛాయుత, ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించేలా ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘ధర్తి ఆబా జన్‌భాగీధారి అభియాన్’ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద వసతిగృహం నిర్మిస్తోంది. తంగళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే గిరిజన విద్యార్థులు 50మంది అందులో వసతి కల్పిస్తారు. జిల్లాలో కేవలం తాండూర్ మండలానికే హాస్టల్ మంజూరు కావడం గమనార్హం.
సకల వసతులు
వసతిగృహంలో రెండంతస్తులుగా నిర్మిస్తారు. కింద డైనింగ్‌హాల్, వంటగది, స్టోర్ రూం, వార్డెన్ కార్యాలయం, మరుగుదొడ్లు, స్నానాల గదులు, రెండు అదనపు గదులతోపాటు మరో మూడు గదులు నిర్మించనున్నారు. మొదటి అంతస్తులో విద్యార్థులు ఉండేందుకు ఎనిమిది భారీ విస్తీర్ణం గల గదులు, స్నానాల గదులు, మరుగుదొడ్లతో కలిపి మరో మూడు అదనపు గదుల నిర్మాణం చేపడతారు. విద్యార్థులకు పడకలు, ర్యాక్, కబోర్డ్స్ తదితర సకల సౌకర్యాలు కల్పిస్తారు.
పనుల్లో జాప్యం
హాస్టల్ భవన నిర్మాణాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ ప్రారంభించారు. జూలై 29న దేశ వ్యాప్తంగా వర్చువల్‌గా అన్ని భవన నిర్మాణాలను అధికారికంగా చేపట్టగా.. తాండూర్‌లోనూ అదే రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఏడాది కాలంలో పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యాసంవత్సరం వరకు భవనాన్ని పూర్తి చేయాల్సి ఉండగా.. పనులు ఆలస్యం కారణంగా అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అధికారులు నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యార్థులకు వసతిని అందుబాటులోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
అందుబాటులోకి తీసుకొస్తాం
నూతనంగా గిరిజన విద్యార్థుల కోసం మంజూరైన భవనాన్ని త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాం. వచ్చే విద్యాసంవత్సరం వరకు భవనాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు వసతి కల్పిస్తాం.
– వినయ్, అసిస్టెంట్ ఇంజనీర్(సోషల్ వెల్ఫేర్)


