బస్సును ఢీకొని బొలెరో డ్రైవర్ మృతి
రెబ్బెన: మండలంలోని దేవులగూడ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ లహరి బస్సును ఢీకొని మంగళవారం తెల్ల వారుజామున బెల్లంపల్లికి చెందిన బొలెరో డ్రైవర్ కొమరే విజయ్ (25) మృతి చెందాడు. ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే కాంట్రా క్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న విజయ్ ప్రతీరోజు బెల్లంపల్లి నుంచి రైల్వే లోకో పైలెట్లను వాహనంలో ఎక్కించుకుని ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్‌లో దింపేవాడు. ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున కూడా అదే తరహాలో బెల్లంపల్లిలో లోకో పైలెట్లను బొలెరోలో ఎక్కించుకుని వస్తున్న క్రమంలో మార్గమధ్యలోని దేవులగూడ వద్ద ముందున్న లహరి బస్సును ఢీకొట్టాడు. ఆసిఫాబాద్ డిపోకు చెందిన లహరి బస్సు హైదరాబాద్ నుంచి ఆసిఫాబాద్‌కు వచ్చే క్రమంలో మార్గమధ్యలోని రెబ్బెన మండలం దేవులగూడ వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం మూలంగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి పోషం ఫిర్యాదు మేరకు బెజ్జూరుకు చెందిన లహరి బస్సు డ్రైవర్ ధారావత్ రామారావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మంగళవారం ఉదయం రెబ్బెన సీఐ సంజయ్ దేవులగూడ వద్ద ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు.


