సిరిచెల్మలో వాహనాల పట్టివేత
ఇచ్చోడ: మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో దొంగిలించిన 34 ద్విచక్రవాహనాలను మండలంలోని సిరిచెల్మలో మంగళవారం మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా క్రైం బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా జిల్లా సరిహద్దులోని మహారాష్ట్రలోగల నాందెడ్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ద్విచక్రవాహనాలను కొంతమంది ముఠాగా ఏర్పడి దొంగిలించారు. వీటిని ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ, గుండాల, కేశవపట్నం, ఎల్లమ్మగూడ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో మంగళవారం ఉదయం రెండు వాహనాల్లో ఇక్కడికి వచ్చిన మహారాష్ట్ర పోలీసులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇచ్చి సిరిచెల్మ కు చేరుకున్నారు. దొంగిలించిన వాహనాల పత్రాలు, ఇంజిన్, చెసిస్ నంబర్ల ఆధారంగా దాదాపుగా 34వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మహారాష్ట్రలో దొంగిలించిన వాహనాలను తక్కువ ధరకు ఇక్కడివారికి విక్రయించినట్లు సమాచారం. పట్టుకున్న వాహనాలను స్వాధీనం చేసుకుని కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు నాందెడ్ జిల్లా క్రైం బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున వాహనాలు మండలంలో దొరకడం, ఎలాంటి పత్రాలు లేని వాహనాలు కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా స్థానిక పోలీసులకు చిక్కకుండా ఉండటం, పక్క రాష్ట్రం నుంచి పోలీసులు వచ్చి వాహనాలను స్వాధీనం చేసుకోవడం లాంటి ఘటనలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.


