ఆవిర్భావ వేడుకలను బహిష్కరించిన ఏఐటీయూసీ
శ్రీరాంపూర్: సింగరేణి ఆవిర్భావ వేడుకలను గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నేతలు బహిష్కరించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్‌మెంట్లు, జీఎం కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన వేడుకలను నల్లబ్యాడ్జీలు ధరించి హాజరై బహిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ కేంద్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా మాట్లాడుతూ.. కార్మికులు ఎంతో ఉత్సాహంగా పండుగలా జరుపుకొనే ఆవిర్భావ వేడుకలకు నిధులు కోత పెట్టి నామమాత్రంగా నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కార్మికుల సొమ్మును రాజకీయ నేతల జోక్యంతో దుబారా చేసే అధికారులు ఇలాంటి వేడుకలు నిర్వహించడానికి ఆంక్షలు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. కార్మికుల హక్కులపై ఇది దాడి చేయడమేనని తెలిపారు. ఈ వైఖరికి నిరసనగా తాము వేడుకలు బహిష్కరించామని పేర్కొన్నారు. యూనియన్ నాయకులు మోత్కూరి కొమురయ్య, సందీప్, తౌటం మల్లేశ్, రాచర్ల రవీందర్, శ్రీకాంత్, ఆడెపు సురేశ్ పాల్గొన్నారు.


