టీబీపై రణం!
మంచిర్యాలటౌన్: క్షయ (టీబీ) నిర్మూలనే లక్ష్యంగా ప్రధానమంత్రి టీబీ రహిత భారత్ (పీఎం ముక్త్ భారత్ అభియాన్) కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతోంది. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు కేంద్ర క్షయ నియంత్రణ విభాగం, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంయుక్తంగా జిల్లాకు రూ.23లక్షల విలువైన పోర్టబుల్ ఎక్స్‌రే మిషన్‌ను అందించాయి. జిల్లా జనాభాలో 20 శాతం 1,76,339 మందిని ఎక్స్‌రే మిషన్ ద్వారా పరీక్షించి ఏఐ అనుసంధానం ద్వారా రిపోర్టును రోగికి, సమీపంలోని పీహెచ్‌సీ వైద్యులు, వైద్య నిపుణులకు పంపిస్తున్నారు. 60ఏళ్లు పైబడిన వారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, బరువు తక్కువ ఉన్నవారితో పాటు వ్యాధిగ్రస్తుల కుటుంబీకులకు ఎక్స్‌రే పరీక్షలు చేసేందుకు ఒక సాంకేతిక నిపుణుడు, ఒక సూపర్‌వైజర్‌ను కేటాయించారు.
2030 లోపు అంతం చేసేలా..
క్షయను పూర్తిగా నియంత్రించేందుకు కొన్నేళ్లుగా వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందిస్తున్నా ఏటా బాధితులు పెరుగుతూనే ఉన్నారు. నివురుగప్పిన నిప్పులా వ్యాధి విస్తరిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం దానిని నిర్మూలించడమే లక్ష్యంగా ఐదేళ్లుగా కృషి చేస్తోంది. అయినా, ఏటా వ్యాధిగ్రస్తుల సంఖ్య వెయ్యికి పైగానే నమోదవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి వ్యాధిని పూర్తిగా అంతమొందించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించింది. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో టీబీ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణైతే బాధితులకు మందులు అందజేస్తున్నారు. సరైన క్రమంలో మందులు వాడుతూ మంచి పౌష్టికాహారం తీసుకుంటే పూర్తిస్థాయిలో టీబీ నయమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
వ్యాధి గుర్తింపు, చికిత్స ఇలా..
ఈ వ్యాధి మైకో బ్యాక్టీరియా ట్యూబర్‌క్యూలోసిస్ ద్వారా సంక్రమిస్తుంది. ఊపిరితిత్తులకు లేదా శరీ రంలోని ఇతర భాగాలకు రెండు రకాలుగా వ్యాపిస్తుంది. 85శాతం మందికి ఊపిరితిత్తులకే సోకడం గమనార్హం. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం వేళ జ్వరం, ఆకలి మందగించడం, బరువు త గ్గడం, చాతినొప్పి, దగ్గినప్పుడు రక్తంతో కూడిన తె మడ వస్తే వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. బాధితులకు వ్యాధి తీవ్రతను బట్టి ఆరు, ఎనిమిది నెలలు, రెండేళ్ల కోర్సు ప్రకారం మందులు వాడాల్సి ఉంటుంది. వ్యాధిగ్రస్తుడు దగ్గి నా, తుమ్మినా తుంపర్లు గాలిలో కలిసి బ్యాక్టీరియా ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వ్యాధి బారిన తొందరగా పడతారు. హెచ్‌ఐవీ, షుగర్ వ్యాధిగ్రస్తులు, అతిగా మద్యం సేవించేవారు, పొగతాగేవారు, గర్భిణులు, పిల్లల తల్లులు, సరైన పోషకాహారం తీసుకోని వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు త్వరగా దీని బారిన పడే ప్రమాదముంది. చికిత్సలో భాగంగా వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ ట్యాబ్లెట్లు వేసుకునేలా ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) చికిత్స విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ వ్యాధిని కచ్చితంగా నిర్ధారించేందుకు అధునాతన సీబీనాట్ (క్యాట్రేజ్ బేస్‌డ్ న్యూక్లిస్ ఆసిడ్ ఆంప్లీ క్లీన్ టెస్టు) విధానం (క్షయ నివారణ విభాగం కేంద్రం) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఉండగా, బెల్లంపల్లి సీహెచ్‌సీలో టునాట్ మిషన్లు అందుబాటులోకి తెచ్చారు. జిల్లా ఆస్పత్రిలో టీబీ టెస్టుల కోసం ప్రత్యేక గది కేటాయించి, సీబీనాట్‌తో పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. టెస్టుల కోసం ట్రూనాట్ మిషన్ కూడా ఏర్పాటు చేయగా, అనుమానితుల నుంచి శాంపిళ్లు సేకరించి వ్యాధిని నిర్ధారిస్తున్నారు. ఇందుకు గాను వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఆస్పత్రికి రావాల్సిన అవసరం ఉండగా, ప్రస్తుతం కేటాయించిన పోర్టబుల్ ఎక్స్‌రే మిషన్‌తో ప్రజల వద్దకే వెళ్లి వ్యాధిని నిర్ధారించే అవకాశమేర్పడింది.
జిల్లాలో గుర్తించిన టీబీ కేసులు ఇలా.. సంవత్సరం గుర్తించిన కేసులు 2020 1,138 2021 1,284 2022 1,445 2023 1,413 2024 1,282 2025 1,071 అనుమానితుల సంఖ్య 1,76,339
ఈ ఏడాది నిర్వహించిన పరీక్షలు
27,599
గుర్తించిన వ్యాధిగ్రస్తులు
1,071


