‘ఫంక్షన్ హాల్’ స్వాధీనమేనా?
సాక్షి ప్రతినిధి మంచిర్యాల: మందమర్రి శివారు, జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ చిక్కుల్లో పడింది. ఏజెన్సీ పరిధిలోని రూ.కోట్ల విలువైన 2.10గుంటల భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? లేదా? అని సర్వత్రా చర్చనీయాంశమైంది. మందమర్రి శివారు ఏజెన్సీ ప్రాంతం 1/70 చట్ట పరిధిలో ఉన్నది తెలిసిందే. అయినప్పటికీ ఇక్కడ విచ్చలవిడిగా కబ్జాలు జరుగుతున్నాయి. ఏజెన్సీలో గిరిజనులకే సర్వ హక్కులుంటాయి. గిరిజనేతరులైతే చట్టం అమలులోకి రాక ముందున్న పట్టాదారుల వారసులకే బదిలీ అవుతాయి లేదా గిరిజనులకు అమ్ముకోవచ్చు. కానీ, ఏజెన్సీ చట్టాన్ని తుంగలో తొక్కి గిరిజనేతరులే రియల్ దందాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఎకరాల కొద్దీ వ్యవసాయ భూముల్లోనూ ప్లాట్లు వెలిశాయి. ఇదే తీరుగా జాతీయ రహదారికి ఆనుకుని ఓ ఫంక్షన్ హాల్ నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూ ఆక్రమణ, నిర్మాణంపై 2016లో ఆదివాసీ నాయక్‌పోడు సేవా సంఘం అధ్యక్షుడితో పాటు మరో నలుగురు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడితోపాటు మరో తొమ్మిది మంది వేర్వేరుగా గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్డీసీ), ఉట్నూరుకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఏజెన్సీ ప్రాంతంలోని నిర్మాణం చట్ట విరుద్ధమని తేలుస్తూ ఎస్డీసీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీటిపై హైకోర్టుకు వెళ్లగా కోర్టు కూడా మళ్లీ అధికారులనే పూర్తి విచారణ చేసి తేల్చాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా విచారణ సాగింది. తుదిగా ఈ నెల 16న సర్వే నంబర్ 350/2/4 పరిధిలోని 2.10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ ఎస్డీసీ, మందమర్రి తహసీల్దార్‌కు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఆక్రమణదారులకు నోటీసులిచ్చారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, మంత్రి సమీప నాయకుడే అనుభవదారుగా ఉండడంతో ఏ మేరకు అధికారులు ముందుకు సాగుతారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు పట్టాదారులు బీసీల నుంచే కొనుగోలు చేసినట్లు పత్రాలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందనేది వేచి చూడాలి.


