తపాలా కార్యాలయాలకు తాళం
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రం మంచిర్యాలలో పోస్టాఫీసులు ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. దీంతో వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో మంచిర్యాలలో హెడ్ పోస్టాఫీసుతో సహా నాలుగు పోస్టాఫీసులు ఉండేవి. గత సెప్టెంబర్‌లో నగరంలోని ఓవర్ బ్రిడ్జి పక్కనున్న గ్రెయిన్ మార్కెట్ ఏరియా పోస్టాఫీసును అధికారులు మూసి వేశారు. అక్కడి సిబ్బందిని ఇతర ప్రాంతాల్లోని శాఖలో సర్దుబాటు చేశారు. రైల్వేస్టేషన్ దగ్గరలోని బజార్ ఏరియా పోస్టాఫీసు భవనం శిథిలావస్థకు చేరడంతో మరమ్మతు చేస్తున్నారు. దీంతో అక్కడా తపాలా సేవలు నిలిపివేశారు. అక్కడి సిబ్బంది జన్మభూమి నగర్‌లోని ప్రధాన తపాలా కార్యాలయంలో పని చేస్తున్నారు. కాగా, ఏసీసీలోని పోస్టాఫీసు కూడా మూతపడింది. సరైన రక్షణ లేకపోవడంతో కార్యాలయ సామగ్రి చోరీకి గురవుతుండడంతో మూసి వేశారు. దీంతో మంచిర్యాలలో ఒకే ఒక్క హెడ్‌పోస్టాఫీసులోనే వినియోగదారులకు అన్ని రకాల సేవలు అందుతున్నాయి. వినియోగదారుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. వివిధ రకాల సేవల కోసం వచ్చిన వారు చాలాసేపు వేచి చూడాల్సి వస్తోంది. రిజిష్టర్ పోస్టులు, స్పీడ్‌పోస్టు సేవలు, ఎలక్ట్రానిక్ మనియార్డర్ సేవలు, ప్రసాదాల పంపిణీ, టీటీడీ దేవస్థానం దర్శనం బుకింగ్‌లు, ఆర్డీలు, డీడీలు, కిసాన్ వికాస పత్రాలు, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ జారీ, సేవింగ్స్ బ్యాంకు, సీనియర్ సిటిజన్ సేవలు, పీపీఎఫ్ ఖాతాలు, సుకన్య సమృద్ధి యోజన, ఆధార్ సేవలు అందిస్తున్నారు. నగరంలో దాదాపు 1.50లక్షల జనాభా నివాసం ఉంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడింది. జనాభా, వినియోగదారులు పెరుగుతున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పోస్టాఫీసులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏరియాల వారీగా కొత్తగా తపాలా కార్యాలయాలు ఏర్పాటు చేస్తే సత్వర సేవలు అందుతాయని వినియోగదారులు కోరుతున్నారు.


