భద్రత మాసోత్సవాలు విజయవంతం చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: రహదారి భద్రత మాసోత్సవాలు విజయవంతం చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, రోడ్డు రవాణా శాఖ అధికారులతో రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలోని రహదారి మాసోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. విద్యార్థులకు రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించాలని అన్నారు.
31న ప్రత్యేక డ్రంక్‌డ్రైవ్ టెస్టులు
రహదారి భద్రత కమిటీ ఆధ్వర్యంలో ప్రతీ నెల సమావేశం నిర్వహించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లాలో ప్రమాద ప్రాంతాల్లో సూచికలు, వేగనిరోధకాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. కొత్త సంవత్సరం వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31న స్పెషల్ డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.


