
నిర్మల్ లో పెన్షన్ విద్రోహదినం పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఉద్యోగసంఘాల జేఏసీ నాయకులు
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమరభేరి
నేడు హైదరాబాద్ సభకు తరలేందుకు సర్వంసిద్ధం..
నిర్మల్‌ఖిల్లా: నాలుగు దశాబ్దాల పాటు ఉద్యోగ విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన తర్వాత ఎంతోకొంత సాంత్వన చేకూర్చేది పెన్షన్.. కానీ సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తూ వస్తున్న ప్రధాన అంశం సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు.. తమ భవిష్యత్ భద్రత కోసం పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిర్వహించనున్న సభకు ఉమ్మడి జిల్లా నుంచి తరలివెళ్లేందుకు కార్యాచరణ రూపొందించుకున్నారు.
ఏమిటీ సీపీఎస్...
ఉద్యోగ జీవిత కాలంలో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా పనిచేసి చివరలో భవిష్యత్తు అనిశ్చితిపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి పెన్షన్ పొందడం వృద్ధాప్యంలో తగిన స్థిరమైన ఆదాయం లేకపోవడం పాత పెన్షన్ విధానం మాదిరి కుటుంబ భద్రత లభించకపోవడం తమను ఆవేదనకు గురిచేస్తోందని సీపీఎస్ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ‘సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు’ నినాదం రాష్ట్రవ్యాప్తంగా మారుమోగుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ఉద్యోగులు ఉపాధ్యాయులు సైతం ఇందులో భాగస్వాములు అయ్యేందుకు నేటి సభకు సన్నద్ధమయ్యారు. 2004లో కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానం స్థానంలో సీపీఎస్ ప్రవేశపెట్టింది. ఇందులో ఉద్యోగుల జీతం నుంచి కొంత శాతం కోత విధించి పెన్షన్ ఫండ్‌లో జమ చేస్తారు. ఉద్యోగ విరమణ అనంతరం ఈ ఫండ్ నుంచి మార్కెట్ పరిస్థితి ఆధారంగా వారికి పెన్షన్ లభిస్తుంది. సీపీఎస్ విధానం ద్వారా ఆర్థిక సామాజిక భద్రత లేకపోవడంతో సీపీఎస్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతప్తి రేకెత్తిస్తోంది.
ఓపీఎస్ పునరుద్ధరణ డిమాండ్..
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్ ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయా సంఘాల జేఏసీ రాష్ట్రస్థాయి నాయకుల ఆదేశాల మేరకు అన్ని జిల్లాల నుంచి సభకు హాజరుకావడంలో భాగంగా నిర్మల్ జిల్లా ఉద్యోగులు సైతం తరలి వెళ్ళనున్నారు. ఎన్నికల సమయంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామంటూ హామీలు గుప్పిస్తున్న అమలులో మాత్రం స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది. సీపీఎస్ రద్దు డిమాండ్ కేవలం ఉద్యోగుల సమస్య మాత్రమే కాదని, వారి కుటుంబ భవిష్యత్ భద్రతకు సంబంధించిన అంశమని జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
తరలివెళ్లేందుకు సమాయత్తం...
హైదరాబాద్‌లో నేడు నిర్వహించనున్న బహిరంగసభకు ఉమ్మడి జిల్లాలోని వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తదితర సిబ్బంది వివిధ వా హనాల్లో రాజధాని బాట పట్టేందుకు సమాయత్తమవుతున్నారు. రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నేడు భారీ బహిరంగసభ నిర్వహించనుండగా ప్రధాన ఉపాధ్యాయుల సంఘం పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో మహాధర్నా నిర్వహించనున్నారు. మహాధర్నాకు ఉపాధ్యాయులంతా నల్లరంగు దుస్తులు ధరించి హాజరుకానున్నట్లు సంఘం నాయకులు పేర్కొంటున్నారు. మరోవైపు దూరభారం వల్ల హాజరుకాలేని సీపీఎస్ ఉద్యోగులు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మహాధర్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల ఐక్యతను ప్రదర్శించే వేదిక కానున్నట్లు నాయకులు స్పష్టం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో ఇలా...
ఖజానా శాఖ లెక్కల ప్రకారం నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ సబ్‌ట్రెజరీ కార్యాలయాల పరిధిలో 7,150 మంది ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులుండగా వీరిలో దాదాపు 4వేలకు పైగా సీపీఎస్ ఉద్యోగులే ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.