పది రోజుల్లో ఛేదించారు! | - | Sakshi
Sakshi News home page

పది రోజుల్లో ఛేదించారు!

Sep 1 2025 10:25 AM | Updated on Sep 1 2025 10:25 AM

పది రోజుల్లో ఛేదించారు!

పది రోజుల్లో ఛేదించారు!

చెన్నూర్‌ ఎస్‌బీఐలో రూ.13.71 కోట్ల కుంభకోణం.. నగలు, నగదు మాయం కేసులో 44 మంది అరెస్ట్‌.. ఇంటి నుంచే మొదలైన మోసం.. పక్కా ప్రణాళికతో కోట్లల్లో కొల్లగొట్టిన క్యాషియర్‌

చెన్నూర్‌: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్‌–2లో జరిగిన రూ.13.71 కోట్ల భారీ మోసాన్ని పోలీసులు కేవలం పది రోజుల్లో ఛేదించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. బ్యాంక్‌ క్యాషియర్‌ నరిగే రవీందర్‌ 25.17 కిలోల బంగారు ఆభరణాలు, రూ.1.10 కోట్ల నగదు, అలాగే 42 నకి లీ బంగారు రుణాల ద్వారా రూ.1.58 కోట్లను కాజేశాడు. ఈ మోసం ఆగస్టు 23న బ్యాంక్‌ ఆడిట్‌ సమయంలో బయటపడగా, ఎస్‌బీఐ రీజనల్‌ మేనేజర్‌ రితేష్‌ కుమార్‌ గుప్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రవీందర్‌ ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు కోల్పోయి, నష్టాలను భర్తీ చేసేందుకు బ్యాంక్‌ మేనేజర్‌ వెన్నపురెడ్డి మనోహర్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి లక్కాకుల సందీప్‌తో కలిసి ఈ మోసాన్ని సుమారు పది నెలల పాటు కొనసాగించాడు.

సాంకేతికతతో నిందితుడి అరెస్ట్‌

మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో పది పోలీసు బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రధాన నిందితుడు రవీందర్‌ను ట్రాక్‌ చేశాయి. రవీందర్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసినప్పటికీ, పోలీసులు వేములవాడలో అతను దైవదర్శనం చేసుకున్నట్లు గుర్తించారు. ఆగస్టు 26న జైపూర్‌ మండలం షెట్‌పల్లిలోని స్వగ్రామానికి చేరుకున్న రవీందర్‌, మరుసటి రోజు నాగ్‌పూర్‌కు పారిపోయే ప్రయత్నంలో ఇందారం క్రాస్‌రోడ్‌ వద్ద పోలీసులకు చిక్కాడు. అతనితో పాటు 44 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, ఎస్‌బీఎఫ్‌సీ, ఇండెల్‌ మనీ, గోదావరి అర్బన్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, మణప్పురం వంటి ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల నుంచి 15.23 కిలోల బంగారు ఆభరణాలు, రూ.1.61 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారం రికవరీకి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల పాత్రపై దర్యాప్తు..

ఎస్‌బీఐ నుంచి కాజేసిన బంగారాన్ని ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థలు అనుమానాస్పద రీతిలో తాకట్టుకు స్వీకరించడంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంస్థల మేనేజర్ల పాత్రను కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే రవీందర్‌ తన భార్య, బంధువులు, స్నేహితుల పేరిట నకిలీ ఖాతాలు సృష్టించి బంగారాన్ని తాకట్టు పెట్టాడు. ఈ మోసంలో కొందరు సంస్థలు కమీషన్‌ ఆధారంగా సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల చాకచక్యానికి ప్రశంసలు..

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఆధ్వర్యంలో ఈ కేసును వేగంగా ఛేదించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్‌ సీఐ దేవేందర్‌రావు, రూరల్‌ సీఐ బన్సీలాల్‌, శ్రీరాంపూర్‌ సీఐ వేణుచందర్‌, మంచిర్యాల సీఐ అశోక్‌, నరేష్‌ కుమార్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ బాబురావు తదితరులను అభినందించారు. నిందితులను రామగుండం నుంచి చెన్నూర్‌కు తరలించి, వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌తో మొదలై...

రవీందర్‌ ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు కోల్పోవడంతో ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. బాసర ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ పూర్తి చేసి టాపర్‌గా నిలిచిన రవీందర్‌, 2017లో ఎస్‌బీఐలో క్యాషియర్‌గా చేరాడు. అ యితే, తన విద్య, పరిజ్ఞానాన్ని సద్విని యోగం చేసుకోకుండా, బెట్టింగ్‌ అలవాటుతో బ్యాంక్‌ నుంచి 402 ఖాతాలకు సంబంధించిన 20.496 కిలోల బంగారాన్ని, రూ.1.10 కోట్ల నగదును కాజేశాడు. తన భార్య, బంధువులు, స్నేహితు ల పేరిట 42 నకిలీ రుణాల ద్వారా రూ.1.58 కోట్లను సమకూర్చాడు. ఈ మొత్తం బెట్టింగ్‌లోనే ఖర్చయిందా లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement