
మాజీ మావో దంపతులకు ఘనస్వాగతం
పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ మండలంలోని అగర్‌గూడకు చెందిన మాజీ మావోయిస్టు చౌదరి అంకుబాయి–గోపన్న దంపతులకు గ్రామస్తులు సోమవారం ఘనస్వాగతం పలికారు. 37 ఏళ్ల క్రితం అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలోకి వెళ్లిన అంకుబాయి ఉద్యమ సమయంలో వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. తల్లిదండ్రులు మరణించినా ఇంటి ముఖం చూడలేదు. సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానానికి వీడ్కోలు పలికి జూలైలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎదుట దంపతులిద్దరు లొంగిపోయారు. మొదటిసారి గ్రామానికి వచ్చిన మాజీ మావోయిస్టు దంపతులతో గ్రామస్తులు జ్ఞాపకాలను పంచుకున్నారు.
చాలా ఆనందంగా ఉంది
ఉద్యమబాట పట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. అమ్మానాన్నల చివరి చూపు చూడలేదు. అనారోగ్యంతో ఉద్యమ బాట వీడి పోలీసుల ఎదుట లొంగిపోయా. చాలా ఏళ్ల తర్వాత ఇంటికి రావడం ఆనందంగా ఉంది. చిన్ననాటి స్నేహితులు, గ్రామస్తులతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నా. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది.
– చౌదరి అంకుబాయి