
సరస్వతి చెరువుకు బుంగ
ఉట్నూర్‌రూరల్: ఇటీవల కురుస్తున్న వర్షాలకు రెండు రోజుల క్రితం మండలంలోని సరస్వతి చెరువుకు బుంగ ఏర్పడి నీరంతా వృథాగా పోతోంది. దీంతో చెరువుకట్ట తెగిపోతుందని రైతులు భయాందోళన చెందుతున్నారు. చెరువు కింద సుమారు వె య్యి ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం రైతులంతా వరినాట్లు వేసుకున్నారు. గతంలో ఇదే చెరువు కట్ట తెగిపోయినప్పుడు తాత్కాలికంగా మట్టిని నింపారని, మరమ్మత్తులు సరిగా చేయకపోవడంతో సమస్య పునరావృతం అయిందని రైతులు ఆరోపిస్తున్నారు. చెరువుకట్ట తెగి నీరంతా పొలాల్లోకి చేరితే పంటలు కొట్టుకుపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతే కాకుండా మత్స్యకారులు సైతం ఈ చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెరువుకట్టకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని స్థానిక రైతులు పవార్ రాజు నాయక్, జాడి రాజన్న, యాట గంగయ్య, జాడి మల్లేశ్, భక్తు శ్రీనివాస్, భక్తు మల్లయ్య కోరుతున్నారు.