డ్రైవింగ్‌లో నో సెల్‌ | - | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్‌లో నో సెల్‌

Sep 2 2025 7:28 AM | Updated on Sep 2 2025 7:28 AM

డ్రైవింగ్‌లో నో సెల్‌

డ్రైవింగ్‌లో నో సెల్‌

ఆర్టీసీ డ్రైవర్లకు నో ఫోన్‌ నిబంధన సురక్షిత ప్రయాణానికి యాజమాన్యం నిర్ణయం పైలట్‌ ప్రాజెక్టుగా ఉట్నూర్‌ డిపోలో అమలు

ఆదిలాబాద్‌/ఉట్నూర్‌రూరల్‌: పలువురు డ్రైవర్ల నిర్లక్ష్యం ఆర్టీసీ ప్రయాణికుల ప్రాణాల మీదకు తీసుకువస్తోంది. నిర్లక్ష్య పూరితమైన డ్రైవింగ్‌ కారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలను నివారించి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ రహదారి భద్రతపై డ్రైవర్లకు పలు సందర్భాల్లో శిక్షణ సైతం అందిస్తోంది. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికంగా ప్రమాదాలు డ్రైవింగ్‌ సమయంలో డ్రైవర్లు మొబైల్‌ ఫోన్‌ వినియోగించడం వలన జరుగుతున్నాయని భావించిన ఆర్టీసీ యాజమాన్యం కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. డ్రైవర్లకు నో ఫోన్‌ నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 11 డిపోల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించింది. సోమవారం నుంచి ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఉట్నూర్‌ డిపో పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 44 మంది డ్రైవర్లు తమ మొబైల్‌ ఫోన్లను డిపోలోనే డిపాజిట్‌ చేసేలా చర్యలు తీసుకున్నారు.

ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా..

సురక్షితమైన ప్రయాణానికి పెట్టింది పేరైన ఆర్టీసీలో సైతం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వారికి రహదారి నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రహదారి భద్రత గురించి వివరిస్తున్నారు. అయినప్పటికీ పలు సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం డ్రైవింగ్‌పై సెల్‌ఫోన్‌ ప్రభావం చూపుతోందని భావించి, విధుల్లో ఉన్నప్పుడు డ్రైవర్లు మొబైల్‌ ఫోన్లు తీసుకు వెళ్లకుండా నో ఫోన్‌ నిర్ణయాన్ని అమలులోకి తీసుకువచ్చింది. సోమవారం నుంచి ఈ నెల 30 వతేదీ వరకు నెల రోజుల పాటు ఈ నిబంధన అమలులో ఉండనుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే డ్రైవర్‌ నడుపుతున్న బస్సులోని కండక్టర్‌కు సమాచారం అందిస్తారు. ఈ విధంగా క్షేత్రస్థాయిలో ఫలితాలను సమీక్షించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement