నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ జిల్లాలో శతాబ్దాల కాలం కిందటి ఎన్నో చారిత్రక అవశేషాలు దర్శనమిస్తున్నాయి. ప్రముఖ చరిత్రకారుడు కరిపె రాజ్‌కుమార్ తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని ఎల్లపల్లి శివారులో 17వ శతాబ్దం నాటి శిల్పాన్ని గుర్తించారు. వీరగల్లు, సతిగల్లు అని పేరు కలిగిన ఈ శిల్పంలో వీరుడు అలంకరించబడిన గుర్రం మీద శూలఖడ్గం, డాలుతో కూడి దృశ్యం గోచరిస్తుంది. వెనుక వైపున అతని సతి కుడిచేయి పైకెత్తి నిలబడి ఉన్న చిహ్నం కనిపిస్తుంది. రాజు తలపాగాలో సూర్యచంద్రుల చిహ్నాలు పొదగబడి ఉన్నాయి. అంటే ఆ వీరుడికీర్తి ఆచంద్రతారార్కం నిలిచిఉండాలనే అర్థం దాగిఉంది.
పబ్లిక్‌స్కూల్ ప్రవేశాల్లో ఆదివాసీలకు అన్యాయం
ఇంద్రవెల్లి: హైదరాబాద్‌లోని పబ్లిక్ స్కూల్‌లో ప్రవేశానికి సోమవారం అక్కడి కలెక్టరేట్‌లో నిర్వహించిన డ్రాలో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తుడుందెబ్బ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పుర్క బాపురావ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం గిరిజనులకు 20 సీట్లు కేటాయించగా అందులో లంబాడీలకు 13, గోండ్, నాయక్‌పోడ్, పర్ధాన్, ఆంధ్ ఆదివాసీలకు 2 సట్లు, కోయలకు 2, ఎరుకలకు 2, పీవీటీజీలకు 1 సీటు మాత్రమే కేటాయించి అసలైన ఆదివాసీలకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. లంబాడీలకు ఎక్కువ, ఆదివాసీ తెగలకు కలిసి తక్కువ సీట్లు కేటాయించడం సరికాదన్నారు.
పాక్షికంగా పలు రైళ్లు రద్దు
కాగజ్‌నగర్‌టౌన్: కాజీపేట్ నుంచి బల్లార్షా వైపు వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే ఛీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాజీపేట్–బల్లార్షాల మధ్య ఆటో మెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల నిమిత్తం రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాజీపేట్–సిర్పూర్‌టౌన్, బల్లార్షా–కాజీపేట్, కాజీపేట్–బల్లార్షా, భద్రాచలం రోడ్–బల్లార్షా, సికింద్రాబాద్–కాగజ్‌నగర్, కాట్ర–కన్యాకుమారి, లక్నో–చైన్నె సెంట్రల్, గోరఖ్‌పూర్–యశ్వంత్‌పూర్, న్యూఢిల్లీ–విశాఖపట్నం రైళ్లను ఈ నెల 3వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
బోగీలు అందుబాటులో లేక పలు రైళ్ల రద్దు
ఆదిలాబాద్: సరిపడా బోగీ (కోచ్)లు అందుబాటులో లేక పలు రైలు సర్వీసులను మంగళవారం రద్దు చేస్తున్నట్లు నాందేడ్ రైల్వే డివిజన్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పర్లీ–ఆదిలాబాద్ మధ్య నడిచే 77615 రైలు సర్వీస్, ఆదిలాబాద్–పూర్ణ మధ్య నడిచే 77616 సర్వీస్ రద్దు చేయనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్–నాందేడ్ మధ్య నడిచే 17409 సర్వీస్, నాందేడ్–ఆదిలాబాద్ మధ్య నడిచే 17410 రైలు సైతం రద్దు చేయడం జరిగిందని వివరించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
గుర్తు తెలియని మహిళ మృతి
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల ఓ షాపు ఎదుట సోమవారం గుర్తు తెలియని మహిళ (45) మృతి చెందింది. షాపు యజమాని ఉదయం షాపు తెరిచేందుకు రాగా మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మహిళ వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఎల్లపల్లిలో వీరగల్లు శిల్పం