
మంచిర్యాల నగరంలోని రాజీవ్ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు
ఏళ్లుగా నిర్మాణంలోనే రెండు పడక గదుల ఇళ్లు
‘ఇందిరమ్మ ఇళ్ల’ రాకతో నిలిచిన పనులు
పూర్తయిన చోట్ల లబ్ధిదారులకు పంపిణీ చేస్తే మేలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణం అతీగతి లేకుండా పోతోంది. ఇటీవల మందమర్రి, రామకృష్ణాపూర్‌లో లబ్ధిదారులకు పంపిణీ చేయగా.. మంచిర్యాల నగర పరిధి రాజీవ్‌నగర్‌లో పూర్తయిన ఇళ్లు లబ్ధిదారులకు అందజేయడం లేదు. ఇంకా కొన్ని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇక మిగతా చోట్ల ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్‌బెడ్రూం ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేయడంతో వాటిపై పట్టింపు లేకుండా పోయింది. దాదాపు అన్ని నిర్మాణ పనులు పూర్తయి డ్రెయినేజీ, విద్యుత్ కనెక్షన్లు, ప్లంబింగ్, నీటి సౌకర్యం కల్పిస్తే మంచిర్యాల పరిధిలోని ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే అవకాశం ఉంది. మిగతా పనులు నెమ్మదిగా సాగడంతో రూ.కోట్లు వెచ్చించి నిర్మించినవి ఏళ్లుగా నిరుపయోగంగా మారే అవకాశం ఉంది.
మంజూరై.. నిలిచిపోయి..
ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదలు కావడంతో డబుల్‌బెడ్రూం ఇళ్లపై పట్టింపు కరువైంది. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. జిల్లాలో 2017లో డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణం మొదలు కాగా, ఐదు వేలకు పైగా ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పలు దశల్లో 2,500 ఇళ్ల వరకు మంజూరయ్యాయి. పట్టణ ప్రాంతాలైన మంచిర్యాల, రామకృష్ణాపూర్, మందమర్రిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట పట్టణాల్లో పిల్లర్లు, స్లాబ్‌ల దశలోనే నిలిచిపోయాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన చోట్ల పిల్లర్ల దశ దాటలేదు. ఆ సమయంలో పని చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోగా, ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ప్రభుత్వం ఇంటికి పట్టణాల్లో రూ.5.30లక్షలు, గ్రామాల్లో రూ.5.04లక్షలు వెచ్చించింది. యూనిట్ ధర నిర్మాణ వ్యయానికి సరిపోవడం లేదని మొదట కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ఆసక్తి చూపలేదు. తర్వాత సిమెంట్, ఇసుక, ఇతర సబ్సిడీలు ఇచ్చినా చాలా చోట్ల కాంట్రాక్టర్లు మారినా ముందుకు సాగలేదు. దీంతో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం అటకెక్కింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆ పథకం స్థానంలోనే మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ లబ్ధిదారులే నేరుగా ఇళ్లు కట్టుకునే అవకాశం కల్పిస్తోంది.
20వేలపైగా అర్జీదారులు
జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 20వేలకు పైగా అర్జీలు చేసుకున్నారు. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పలు రకాలుగా లబ్ధిదారులను గుర్తించారు. మందమర్రి మండలం రామక్రిష్ణాపూర్ పట్టణ పరిధిలో రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లలో మొత్తం 286 ఇళ్లకు ఇందులో 230ఇళ్లు పంపిణీ చేశారు. మరో 56 మిగిలాయి. మందమర్రి పట్టణం పాలచెట్టు వద్ద 560ఇళ్లకు గాను 243 పంపిణీ చేశారు. లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. ఇక మంచిర్యాల నగర పరిధిలో పలు దశల్లో మంజూరైన 650ఇళ్లలో 30మాత్రమే లబ్ధిదారులు ఉంటున్నారు. వీటిలో 360ఇళ్లు నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్నాయి. నీటి సరఫరా, విద్యుద్ధీకరణ, మురుగుపారుదల, అంతర్గత రోడ్లు నిర్మించాల్సి ఉంది. అక్టోబర్ వరకు పనులు పూర్తి చేసి సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో మిగిలిన పనులు పూర్తయితే లబ్ధిదారులకు పంపిణీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.