
డంపింగ్ యార్డు తరలేనా..!
● నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు ● నివేదిక కోరిన ట్రిబ్యునల్ ● ప్రజల అభ్యంతరాలతో మరోచోట స్థలం సేకరణ
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని ఆండాళమ్మ కాలనీలో ఉన్న డంపింగ్ యార్డులో చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది. అందులోకి చెత్త వాహనాలూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు చెత్తను కాల్చడం వల్ల వెలువడే పొగను పీల్చడం, దుర్వాసనతో సమీపంలోని కాలనీల ప్రజలు రోగాల బారిన పడాల్సి వస్తోంది. పట్టణ శివారులో ఉన్న ఆండాళమ్మ కాలనీలో గతంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయగా.. పట్టణం విస్తరించి, జనాభా పెరిగి సమీపం వరకు ఆండాళ్లమ్మకాలనీ, గ్రీన్‌సిటీ, రంగంపేట్, పవర్‌సిటీ కాలనీలు ఏర్పడ్డాయి. ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతుండడంతో నగరానికి చెందిన ఎండీ.నహీమ్‌పాషా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ)కి గత ఏడాది ఫిర్యాదు చేశారు. దీంతో జూలై 18న ఎన్‌జీటీ సౌతరన్ జోన్ చెన్నయ్ దర్యాప్తు చేపట్టి డంపింగ్ యార్డుపై నివేదిక సమర్పించాలని కోరింది. ఇప్పటికే అధికారులు పలుమార్లు విచారణ జరిపి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వివరణ తీసుకున్నారు. దీంతో డంపింగ్ యార్డు తరలింపుపై స్థానికుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. డంపింగ్ యార్డు కోసం శాశ్వత స్థలాన్ని అధికారులు గుర్తిస్తున్నా ఏదో ఒక కారణంతో వినియోగించలేని పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం నస్పూర్‌లోని సింగరేణి స్థలాన్ని గుర్తించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి తీసుకున్నా అక్కడికి తరలించడంలో జాప్యం జరుగుతోంది.
బయోమైనింగ్ ఆలస్యం
డంపింగ్‌యార్డులో చెత్తను శుద్ధి చేసి, చెత్త లేకుండా చేయడమే లక్ష్యంగా బయోమైనింగ్ ప్రక్రియను గత ఏడాది ప్రారంభించారు. నగరంలో ప్రతీ రోజు 40మెట్రిక్ టన్నులకు పైగా చెత్త వెలువడుతోంది. యార్డులో మరో లక్షకు పైగా మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. 62వేల మెట్రిక్ టన్నుల చెత్త బయోమైనింగ్ చేసేందుకు ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఇప్పటికే ఆ సంస్థ 66వేల మెట్రిక్ టన్నుల వరకు బయైమెనింగ్ ప్రక్రియతో యార్డులో దాదాపు సగం చెత్తను తొలగించింది. ఇంకా 60వేలకు పైగా మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయి ఉంది. ప్రతీ రోజు యార్డులో చెత్త వేస్తుండడంతో పెరిగిపోతోంది. యార్డు పక్కనే అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండడంతో చిన్నారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏటా వర్షాకాలంలో దుర్వాసనతోపాటు దోమలు, వ్యాధుల బారిన పడుతున్నారు. తరలింపుపై మంచిర్యాల నగర కమిషనర్ సంపత్‌కుమార్‌ను సంప్రదించగా.. ఇటీవలే బాధ్యతలు తీసుకున్నానని, తనవద్ద సమాచారం లేదని తెలిపారు.
తరలింపునకు పోరాటం
ఆండాళమ్మ కాలనీలో ని డంపింగ్ యార్డు ను ప్రజల నివాసాలకు దూరంగా తరలించాలని ఆ ప్రాంత ప్రజలు పోరాటం చేస్తున్నారు. దుర్వాసన, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశాను. చెన్నయ్‌లో విచారణ సాగుతుండగా.. యార్డులోని చెత్తను పూర్తిగా బయోమైనింగ్ చేసి తొలగించామని అధికారులు ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కానీ డంపింగ్‌యార్డులో సగానికి పైగా చెత్త పేరుకుపోయి ఉంది. అధికారులు డంపింగ్‌యార్డును ప్రజల కోసం తరలించేందుకు కృషి చేయాలి.
– ఎండి. నహీం పాషా,
ఫిర్యాదుదారుడు, మంచిర్యాల

డంపింగ్ యార్డు తరలేనా..!