ఒక సిమ్‌తో ఒకేసారి కాల్‌ ! | - | Sakshi
Sakshi News home page

ఒక సిమ్‌తో ఒకేసారి కాల్‌ !

Aug 1 2025 12:23 PM | Updated on Aug 1 2025 12:25 PM

● ఆ తర్వాత సిమ్‌ లేకుండా ధ్వంసం ● ‘జన్నారం సైబర్‌’ కేసులో నిందితుల తీరిదీ ● మాస్టర్‌ మైండ్‌ జాక్‌ ఖాతాలో భారీగా నగదు ● ముమ్మరంగా కేసు దర్యాప్తు, నిందితులకు 14రోజుల రిమాండ్‌

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఒక ఫోన్‌కాల్‌కు ఒకేసారి సిమ్‌ వాడుతూ ఆ తర్వాత వాటిని ధ్వంసం చేస్తూ నిత్యం వందలాది కాల్స్‌ చేస్తూ రూ.లక్షల సొమ్ము కాజేసే యత్నం జరిగింది. జన్నారం కేంద్రంగా సాగిన సైబర్‌ నేరాన్ని రామగుండం సైబర్‌ క్రైం పోలీసులు తీవ్రంగా పరిగణించి విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏడుగురు ఈ కేసులో ఉన్నట్లు గుర్తించారు. నలుగురిని అరెస్టు చేశారు. గురువారం నిందితులను లక్సెట్టిపేట కోర్టులో హాజరుపర్చగా.. వారికి 14రోజుల రిమాండ్‌ విధించారు. సైబర్‌ నేరాలు చేసేందుకు ఆధునిక సాంకేతికతను వాడుతూ అమాయక జనాలను కేవలం ఫోన్‌లో మాట్లాడి మభ్యపెడుతూ సొమ్మును తస్కరించే పనుల్లో నిమగ్నమయ్యారు. గత నెలన్నరలోనే వేలాది మందికి ఎక్కడి నుంచో ఫోన్‌ కాల్స్‌ చేస్తూ ఇక్కడి లొకేషన్‌ చూపించేలా ఏర్పాట్లు చేశారు. గోల్డెన్‌ ట్రయాంగిల్‌ ఏరియాగా పిలిచే కంబోడియా, మయన్మార్‌ నుంచి ఈ వ్యవస్థను నియంత్రిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రాలో రోడ్లపై విక్రయించే వారి నుంచి సిమ్‌లు వందలకొద్దీ కొనుగోలు చేసి, యాక్టివ్‌ చేసి మాట్లాడగానే పని పూర్తయిన వెంటనే ఆ సిమ్‌ను పాడేసినట్లు గుర్తించారు. ఎప్పటికప్పుడు యాక్టివ్‌ అయిన సిమ్‌ వివరాలను ఓ బుక్‌లో రాసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆ బుక్‌లోని వివరాల ప్రకారం ఎవరెవరికి కాల్స్‌ చేశారు..? ఇందులో ఎంతమొత్తం డబ్బు దోచుకున్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

జాక్‌ ఖాతాల్లో రూ.కోట్లలో డబ్బు

ప్రస్తుతం పరారీలో ఉన్న వైజాక్‌ చెందిన జాక్‌ అలియాస్‌ రాజు జన్నారానికి చెందిన వారితోపాటు ఆంధ్రా వారినీ ఈ నేరంలో భాగస్వామ్యం చేస్తూ పథకం రచించాడు. గత మే నుంచే ఈ తంతంగం మొదలు కాగా, గత నెలన్నరగా మోసాలు చేసే ప్రయత్నాలు చేశారు. దర్యాప్తులో భాగంగా జాక్‌ బ్యాంకు ఖాతాలో రూ.కోటికిపైగా లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాక అతడు చెప్పినట్లు చేసినందుకు రూ.లక్షల్లో డబ్బు స్థానికులకు పంపాడు. మోసం చేస్తున్నామని తెలిసినా జన్నారం వాసులు ఇందులో ఇరుక్కుపోయారు.

ఐఎంఈఐ కనిపించకుండా

సైబర్‌ నేరగాళ్లు కాల్స్‌ చేస్తే వాళ్లు చేసే ప్రాంతం, చూపించే లొకేషన్‌ భిన్నంగా ఉండేందుకే జన్నారంను ఎంపిక చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక సిమ్‌ బాక్స్‌లో ఒకేసారి 256సిమ్‌లు వాడుతూ, ఐఎంఈఐ కూడా గుర్తించకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు. అంతేకాక లొకేషన్‌ ట్రేస్‌ చేస్తే అడవులు, కొండల మధ్య టవర్‌ సిగ్నల్స్‌ను ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో ముందుగా జన్నారం పోలీసులు ఆచూకీ వెతికినా నేరగాళ్లు బయటపడలేదు. ఇదంతా కంబోడియా నుంచే పూర్తిగా ఈ వ్యవహారం నడిచిందా? వీరి వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నా రు. వీరిలో చేతిలో ఎందరు మోసపోయారు? దోచి న డబ్బు ఏ ఖాతాల్లోకి వెళ్లిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే నేరంలో ప్రధానంగా వ్యవహారించిన జాక్‌ దొరికితేనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అతన్ని పట్టుకోవడం కోసం లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు.

ఒక సిమ్‌తో ఒకేసారి కాల్‌ !1
1/1

ఒక సిమ్‌తో ఒకేసారి కాల్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement