
టీచర్లు ‘ముఖం’ చూపించాలి
● ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏ అమలుకు నిర్ణయం ● నేటి నుంచి రిజిస్ట్రేషన్, హాజరు నమోదు షురూ
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అమలు చేస్తున్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం అటెండెన్స్(ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏ) విధానాన్ని ఇక ఉపాధ్యాయులకూ అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, గురుకులాల్లోని టీచర్ల హాజరు శాతం తేల్చనుంది. ప్రస్తుత విధానంలో ఉపాధ్యాయుల గుర్తింపు సంఖ్య(ఐడీ)ను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. యాప్‌లో మొదట ఉపాధ్యాయుల గుర్తింపుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ కానుంది. రోజూ ఉదయం పాఠశాలకు వచ్చిన, వదిలి వెళ్లే సమయాల్లో హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకే యాప్ విధానంపై జూమ్ ద్వారా అవగాహన కల్పించారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన డీఈవోల సమావేశంలో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆగస్టు ఒకటి నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం, రిజిస్ట్రేషన్లు నమోదు, హాజరు నమోదు తప్పనిసరని డీఈవో యాదయ్య తెలిపారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్‌ను సంప్రదించాలని సూచించారు.
పారదర్శకత
ఈ విధానంలో హాజరు నమోదు వల్ల ప్రతీ ఒక్కరికి క్రమశిక్షణ, బాధ్యత అలవడుతాయి. బడికి సమయానికి రావడం, వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులకు మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. చేసే పనిలో జవాబుదారీతనం పెరుగుతుంది. పెండింగ్ లేకుండా పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. గతంలో గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో సిగ్నల్స్ లేక కొన్ని చోట్ల బయోమెట్రిక్ పరికరాలు పని చేయకుండా చేశారనే ఆరోపణలు లేకపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లోనే బయోమెట్రిక్ అమలు చేస్తుండగా.. జిల్లాలో ఎటూ తేల్చలేదు. బయోమెట్రిక్ విధానం అమలుకు ఆలస్యం కావడంతో కరో నా ముందు వరకు జిల్లాలో టీచర్లకు మొబైల్ ఆప్లికేషన్ యాప్ అమలు చేశారు. అప్పటి కలెక్టర్ ఆదేశానుసారం యాప్ అమల్లోకి వచ్చింది. ఉపాధ్యాయులు స్కూల్‌కు వెళ్లి మొబైల్‌లో ఫొటో తీసి సబ్మిట్ చేసేవారు. ఆర్నెల్ల తర్వాత యాప్ అటకెక్కింది. మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయులు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండడం వల్ల సమయానికి పాఠశాలలకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇక టీచర్లకు రిజిష్టర్ అటెండెన్స్ కొనసాగుతోంది. కొందరు టీచర్లు బడికి రాకపోయినా తర్వాత రోజు అటెండెన్స్ వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వచ్చినా వారూ సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏ విధానంతో ఉపాధ్యాయుల డుమ్మాలకు చెక్ పడే వీలుంది.