
ఏజెన్సీ ప్రాంతాల్లో డీఎస్సీ నిర్వహించాలి
ఉట్నూర్‌రూరల్: రాష్ట్రప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో డీఎస్సీని ప్రకటించాలని సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు జాదవ్ సుమేశ్, నాయకుడు దీపక్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ట్రైబల్ అడ్వైయిజరీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. జీవో 3 పునరుద్ధరించి, ఏజెన్సీ హక్కుల పరిరక్షణకు కీలకంగా ఉన్న జీవోను ప్రభుత్వం తిరిగి అమలు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 29 శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలన్నారు. 2013లో సర్వశిక్షణ అభియాన్ ద్వారా మంజూరైన 569 పోస్టులకు ప్రభుత్వ ఆమోదించి, ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.