దైవ దర్శనానికి వెళ్లి..కానరాని లోకాలకు
శంకర్‌లొద్ది గుండంలో పడి యువకుడి మృతి
నార్నూర్: ఉగాది పండుగ పూట విషాదం నెలకొంది. దైవ దర్శనానికి వెళ్లి శంకర్‌లోద్ది గుండంలో పడి యువకుడు మృతిచెందాడు. కుమురం భీం జిల్లా కెరమరి మండలం శంకర్‌లోద్ది గుండం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నార్నూర్ మండలంలోని గంగాపూర్ తండా చెందిన పవార్ సంగీత–ఉత్తం దంపతులకు ఇద్దరు సంతానం. ఒక కూతురు పెళ్లయింది. ఒక కుమారుడు పవార్ శంకర్ (22) ఉన్నాడు.
శంకర్ బొలెరో వాహన డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దంపతులిద్దరు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దీక్షలో ఉన్నారు. ఉగాది సందర్భంగా కెరమెరి మండలంలోని శంకర్‌లోద్దిలో శివలింగం గుహలో దర్శనంతోపాటు దీక్ష గురువు శ్రీ సద్గురు ప్రేంసింగ్ మహారాజ్ దీక్ష చేపట్టిన పుణ్యస్థలం కావడంతో సేవాలాల్ భక్తులు, మాలధరించిన వారు వందల సంఖ్యలో వెళ్లారు. దీక్షలో ఉన్న దంపతులిద్దరు ఆదివారం కుమారుడిని వెంట తీసుకెళ్లారు. గుహ ముందు ఉన్న వాగులో స్నానానికి బండపై నుంచి దూకాడు.
నీటిలో రెండు రాయి మధ్య ఇరుక్కుని మునిగి చనిపోయాడు. గంగాపూర్ తండా గ్రామం శోకసంద్రంలో మునిగింది. కుమారుడు మృతితో కుటుంబ సభ్యుల కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్వాప్తు చేస్తున్నట్లు కెరమెరి ఎస్సై విజయ్ తెలిపారు.


