● కొద్దిరోజులుగా నాసిరకమైనవి పంపిణీ ● చిరిగిపోతున్నా పట్టింపేది ● నలిగిపోతున్న చేతులు ● ఇబ్బంది పడుతున్న కార్మికులు
నాణ్యమైనవి తెప్పిస్తాం
గ్లౌజ్‌లు నాసిరకంగా వస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. సరఫరా చేసే కంపెనీతో మాట్లాడి నాణ్యమైనవి తెప్పిస్తాం.
– శ్రీధర్‌రావు, ఏఎస్‌ఓ, శ్రీరాంపూర్
శ్రీరాంపూర్: నాసిరకం చేతిగ్లౌజ్‌లతో కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గనుల్లో పని చేసేటప్పుడు చేతులకు గాయాలు కాకుండా వీటిని ఉపయోగిస్తారు. గతంలో నాణ్యమైనవి ఇచ్చినప్పటికి కొద్దిరోజులుగా నాసిరకంగా ఉంటున్నాయని పలువురు కార్మికులు పేర్కొంటున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులు, డిపార్టుమెంట్లలో కార్మికులు వినియోగిస్తున్న గ్లౌజ్‌లు కొన్నిరోజులకే చిరిగిపోతున్నాయి. ప్రతీ డిజిగ్నేషన్ కార్మికుడు పని చేసేటప్పుడు చేతులు నలుగకుండా, గాయాలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మూడేళ్లుగా చేతిగ్లౌజ్‌లు ఇస్తున్నాయి. ఎలక్ట్రీకల్ పనులు, భారీ యంత్రాలు, పనిముట్లతో పనిచేసేవారికి, ట్రామర్లు, లైన్‌మెన్లు, ఇంజినీరింగ్ డిపార్టుమెంట్, సివిల్ డిపార్టుమెంట్ ఉద్యోగులకు వేర్వేరు క్వాలిటీలతో కూడిన గ్లౌజ్‌లు ఇస్తారు. ఇందులో ఎక్కువ మంది ఉపయోగించే రెగ్యులర్ మోడల్ గ్లౌజ్‌లు నాసిరకంగా వస్తున్నాయి. వీటి టెండర్‌ను పొందిన సదరు కంపెనీ నాసిరకంవి సరఫరా చేస్తూ కంపెనీకి నష్టం చేస్తుందని కార్మికులు పేర్కొంటున్నారు. గతంలో ఇచ్చిన గ్లౌజ్‌లు కనీసం మూడునెలల వరకు పనిచేసేవని ఇప్పుడు నెల రోజులకే చిరిగిపోతున్నాయని వాపోతున్నారు.
అధికారుల దృష్టికి..
జనవరిలో జరిగిన ఏరియా స్థాయి స్ట్రక్షరల్ మీటింగ్‌లో ఈ సమస్యను గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు అధికారుల దృష్టికి తెచ్చారు. నాసిరకంగా వస్తున్నాయని అధికారుల అంగీకరించారు. అయితే గ్లౌజ్‌లు సరఫరా చేస్తున్న కంపెనీ మార్కెట్‌లోనే టాప్ కంపెనీ అని వారివద్ద నుంచి కూడా ఇలాంటివి సరఫరా కావడంపై విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే ఈ నాసిరకం గ్లౌజ్‌లు చిరిగిపోయిన వెంటనే వాటి స్థానంలో కనీసం కొత్తది ఇవ్వాల్సి ఉండగా కొందరు గనుల అధికారులు ఇవ్వకుండా స్టాక్ లేదంటూ వాటితోనే పని చేయాలని ఒత్తిడి తెస్తున్నారని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. స్టోర్స్‌లలో స్టాక్ ఉన్న కూడా కొత్తవి ఇవ్వకపోవడం సరికాదంటున్నారు. ఇప్పటికై నా యజమాన్యం స్పందించి నాణ్యమైన గ్లౌజ్‌లు తెప్పించి ఇవ్వాలని కోరుతున్నారు.


