
సింగరేణిలో రాజకీయ జోక్యం
● టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి
శ్రీరాంపూర్: సింగరేణిలో గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయం జోక్యం పెరిగిందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఆర్కే 6 గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో కార్మికులతో మాట్లాడారు. సంస్థ కార్యకలాపాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. కార్మికులకు రావాల్సిన లాభాల వాటలో అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రప్రభుత్వం, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు కలిసి కార్మికులకు అన్యాయం చేశాయన్నారు. రూ.4701 కోట్ల నుంచి 33 శాతం లాభాల వాటా రూ.1551 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 976 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. వాస్తవ లాభాల నుంచి కాకుండా పెట్టుబడి పేరుతో లాభాల్లో కోతపెట్టి కార్మికులకు నష్టం చేసిందన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ వైఖరికి నిరసనగా ఆదివారం గోదావరిఖనిలో చౌరస్తాలో టీబీజీకేఎస్, బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్మికులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బ్రాంచి ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్, కేంద్ర కమిటీ నాయకులు బండి రమేశ్, పానుగంటి సత్తయ్య, పొగాకు రమేశ్, అన్వేష్‌రెడ్డి, ముత్యాల రమేశ్, డివిజన్ నాయకులు గొర్ల సంతోష్, మహిపాల్‌రెడ్డి, పానుగంటి తిరుపతి, ఉత్తేజిరెడ్డి, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.