● అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
● ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి వీపీ గౌతం
● ఎల్నినో ప్రభావంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రత్యేకాధికారి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతం అన్నారు. గురువారం మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్, భూగర్భజలాలు, ఉద్యానవన, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులతో ఎల్నినో ప్రభావాలు, పంటల పరిస్థితి, నీటి లభ్యత, విద్యుత్ సరఫరా, ముందస్తు కార్యాచరణ, ప్రత్యామ్నాయ ప్రణాళికలపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తాగునీటి సరఫరా, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల్లో తలెత్తే సమస్యలను అధిగమించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాకాలం ముగింపు దశకు చేరినందున ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం, ఖరీఫ్ సాగు విస్తీర్ణం, పంటల పరిస్థితి, భూగర్భ జల మట్టాలను సమీక్షించి.. రానున్న అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే రబీ సీజన్లో నీటి లభ్యత, సాగునీటి పరిస్థితులపై వాస్తవాలను రైతులకు వివరించాలని చెప్పారు. వ్యవసాయం, సాగునీటి అవసరాలకు అధికంగా నీటిని వినియోగిస్తే తాగునీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున తాగునీటికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.
జూరాల, కేఎల్ఐపై..
కేఎల్ఐలో మూడు పంపుల నిర్వహణ, విద్యుత్ సరఫరా పరిస్థితులను ప్రత్యేకాధికారి సమీక్షించారు. ఒక పంపునకు 24 గంటలు, మిగతా రెండు పంపులకు 18 గంటల చొప్పున విద్యుత్ సరఫరా జరుగుతోందని అధికారులు వివరించారు. పంపుల నిర్వహణకు అవసరమైన విద్యుత్ సరఫరాపై ఆయా శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. జూరాల ఆయకట్టు పరిధిలో అక్రమంగా మోటార్ల ద్వారా నీటిని వినియోగించడాన్ని అరికట్టేందుకు రెవెన్యూ, నీటిపారుదల, పోలీసు శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
● వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సమన్వయంతో పనిచేస్తూ తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని చెప్పారు.
● వీబీ జీ రాంజీ పథకం కింద పాంపాండ్లు, సోక్ పిట్స్ తదితర నీటి సంరక్షణ పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ పనుల ద్వారా భూగర్భ జలాల పెంపునకు తోడ్పడటంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి రోజులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
● ఉమ్మడి జిల్లాలో మొదటి దశలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, వాటిని త్వరగా పూర్తి చేయడంతోపాటు రెండో దశలో ఇళ్ల మంజూరుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో 5–10 ఇళ్ల నిర్మాణాల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్ సరఫరా, ఇసుక లభ్యతపై చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులకు కంపెనీలు నేరుగా దసరా నుంచి సబ్సిడీపై సిమెంట్ అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమావేశంలో మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, ఆదర్శ్ సురభి, ప్రియాంక, రిజ్వాన్బాషా షేక్, మహబూబ్నగర్ శిక్షణ కలెక్టర్ శివాని, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


