కొల్లాపూర్: రేవంత్రెడ్డి సర్కార్ బీసీలను నమ్మించి మోసం చేసిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. మల్లన్న చేపట్టిన పాదయాత్ర గురువారం సాయంత్రం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 33 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లను కేసీఆర్ ప్రభుత్వం 23 శాతానికి తగ్గిస్తే.. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక 19 శాతానికి తగ్గించేశారన్నారు. ఎన్నికల మెనిఫెస్టోలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని.. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను విస్మరించి రాజకీయ పదవులు, ఉపాధి అవకాశాలు, రిజర్వేషన్లు అన్నీ అగ్రకులాలకే కట్టబెడుతోందని ధ్వజమెత్తారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుచేయాలని ఓవైపు కాంగ్రెస్ పెద్దలు ప్రకటనలు చేస్తున్నారని.. ఆ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం బీసీ రిజర్వేషన్లపై ఎవరూ మాట్లాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన లెక్కల ప్రకారం బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని.. ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం వాటా దక్కాలని డిమాండ్ చేశారు. బీసీల అభివృద్ధికి రూ. 20వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోందని.. ఆ ఖర్చులకు సంబంధించిన లెక్కలు మాత్రం చెప్పడం లేదన్నారు. బీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలతో పాటు చేనేత, కల్లుగీత కార్మికుల సంక్షేమ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. రాజ్యాధికారంతోనే బీసీల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. బీసీలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఇప్పటివరకు 42 నియోజకవర్గాల్లో పర్యటించానని వివరించారు. బీసీల హక్కుల పరిరక్షణకోసం తాను ఎంతదూరమైనా వెళ్తానని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.


