మహబూబ్‌నగర్ న్యూటౌన్: అబద్ధపు ప్రచారంతో పేదలకు అందించే సంక్షేమ పథకాలు ఎగవేసేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారని యువ మహిళా రాష్ట్ర మాజీ కన్వీనర్, సామాజిక రచయిత్రి, గాయని శ్యామల ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో ఈనెల 26న నిర్వహించే భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జిల్లా మహాసభల నిర్వహణపై బుధవారం సురవరం వెంకట్రాంరెడ్డి భవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ దేశంలో పాలకులు మహిళా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో కార్పొరేట్ శక్తులు రూ.కోట్లు ప్రజాధనాన్ని రుణాల పేరుతో తీసుకొని తిరిగి చెల్లించకుండా ఎగ్గొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడితే మాత్రం కొందరు మేథావులు నిధులు దుర్వినియోగం అవుతున్నాయని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలు నేటికీ సామాజిక వివక్ష ఎదుర్కొంటున్నారని వాపోయారు. దశాబ్దాలు గడుస్తున్నా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి మోక్షం దొరకట్లేదన్నారు. అనంతరం ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పద్మావతి మాట్లాడుతూ.. భారత జాతీయ మహిళా సమాఖ్య మహాసభలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా రిజర్వేషన్లు వంటి అనేక సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశానికి మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, జిల్లా నాయకురాలు ఇందిర, పర్వీన్‌బేగం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి.సురేష్, రాధ, వరలక్ష్మి,అరుణ, రుక్మిణి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.


