గోపాల్‌పేట: బోరు మోటారు సరి చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఏదుట్ల శివారులోని బావిలో పడి గల్లంతైన రైతు ఉడుముల పెద్దనర్సింహ (58) మృతదేహం బుధవారం లభ్యమైంది. వివరాలు.. పెద్దనర్సింహ మంగళవారం మధ్యాహ్నం బావిలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. రెస్క్యూ టీం సభ్యులు బావిలో తీవ్రంగా గాలించగా.. రాత్రి 10 గంటల తర్వాత మృతదేహం లభ్యమైంది. బుధవారం గ్రామంలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమాదంపై గోపాల్‌పేట ఎస్‌ఐ శశిధర్‌ను వివరణ కోరగా.. తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సమాధానమిచ్చారు.
అనారోగ్యంతో
రైతు ఆత్మహత్య
జడ్చర్ల: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రైతు మనోవేధనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ మల్లేష్ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. మండలంలోని ఆలూరుకు చెందిన కుమ్మరి కొండయ్య (59) కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 20న తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోగా.. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
దొంగ అరెస్టు:
రూ.1.75 లక్షలు స్వాధీనం
కల్వకుర్తి టౌన్: పట్టణంలోని వైన్‌షాపులో జరిగిన చోరీ కేసులో దొంగను బుధవారం పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లుగా కల్వకుర్తి సీఐ భీమ్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. సోమవారం నాగర్‌కర్నూల్ చౌరస్తాలోని శ్రీలక్ష్మి వైన్స్‌లో దొంగలు చొరబడిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో అనుమానస్పందంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడిని విచారించగా పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో నివాసముండే మల్లికార్జునరెడ్డి అని, వైన్స్‌లో దొంగతనం చేశానని నేరాన్ని ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. నిందితుడి నుంచి దొంగతనానికి ఉపయోగించిన సుత్తి, కటింగ్ ప్లేయర్, రూ.1.75 లక్షలు, సీసీ కెమెరాల డీవీఆర్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం కల్వకుర్తి సీనియర్ కోర్టులో హాజరుపర్చగా అతడికి జడ్జి రిమాండ్ విధించినట్లుగా సీఐ వెల్లడించారు. కేసును త్వరగా ఛేదించి దొంగను పట్టుకున్న కల్వకుర్తి సీఐ, ఎస్‌ఐ కురుమూర్తి, సిబ్బందిని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌రెడ్డి అభినందించారు.
ఆధ్యాత్మిక
చైతన్యానికి ప్రతీక
కల్వకుర్తి రూరల్: ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా 91వ విశ్వశాంతి మహాయాగం నిర్వహిస్తున్నట్లు కృష్ణజ్యోతి స్వరూపానందస్వామి అన్నారు. పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న మహాయాగంలో బుధవారం ఉదయం లక్ష్మీగణపతి, అఘోర, పాశుపత రుద్ర, మృత్యుంజయ, చంద్రగ్రహణ హోమాలు నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత పారాయణం, భజనలు వివిధ భక్త బృందాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సాయంత్రం అష్టలక్ష్మి విశేష పూజలు, జ్యోతిర్లింగార్చన, ద్వాదశ జ్యోతిర్లింగార్చన అభిషేకాలు అర్చనలు కల్యాణ మహోత్సవం, సామూహిక కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో జరిపించారు. యాగశాల ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. రెండు రోజులుగా కల్వకుర్తి ప్రాంతంలో ముసురు వర్షం యాగఫలమేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. దాదాపు 2వేల మందికి అన్న ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు జూలూరు రమేష్‌బాబు, బిచని బాలకృష్ణ, పోల సురేందర్, మదన మురళి, జంగయ్యగౌడ్, ప్రకాష్, పెద్దయ్యగౌడ్, కల్మచర్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


