సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటు వేయలేదని.. | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటు వేయలేదని..

Jun 19 2026 12:48 AM | Updated on Jun 19 2026 12:48 AM

అమరచింత: సర్పంచ్‌ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని ఓ దళిత మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని రిజిస్ట్రేషన్‌ చేయకుండా మాజీ సర్పంచ్‌ వేధిస్తున్న ఘటన మండలంలోని సింగంపేటలో చోటు చేసుకుంది. బాధితురాలు చిన్నపాగ రుక్కమ్మ తెలిపిన వివరాలు.. 2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సీఎం వైస్‌.రాజశేఖరరెడ్డిఽ మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఒకొక్కరికి 35 గుంటల భూమిని పంపిణీ చేసేలా పథకం ప్రవేశ పెట్టారు. ఇందులో భాగంగానే గ్రామంలో మహిళా సంఘాల్లో పనిచేస్తున్న 55 మంది నిరుపేద వ్యవసాయ కూలీలకు 35 గుంటల చొప్పున గ్రామసభలో తీర్మానం చేసి పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో సర్పంచ్‌గా ఉన్న విజయలక్ష్మి మహిళా సంఘం అధ్యక్షురాలిగా ఉన్నారు. 55 మందికి పంచేందుకు గ్రామ సభలో తీర్మాణం చేసి భూమిని కేటాయించారు. అందులో రుక్కమ్మకు 35 గుంటల భూమి మంజూరైంది. రుక్కమ్మకు వచ్చిన భూమిలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా ఉన్న విజయలక్ష్మి 2013లో సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేయగా.. ఓటమిపాలైంది. తన ఓటమికి రుక్కమ్మ, లక్ష్మి, రాములమ్మ కారణమని వారికి ప్రభుతం అందించిన భూమిని రిజిస్ట్రేషన్‌ చేయకుండా తాత్సారం చేసుకుంటూ వచ్చారు. 55 మందిలో 52 మందికి విజయలక్ష్మి రిజిస్ట్రేషన్‌ చేసి భూ పంపిణీ చేశారు. 19 ఏళ్లు కావస్తున్న తమకు ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని బాధితులు మాజీ సర్పంచ్‌ని ప్రశ్నించగా.. తనకు మీరు ఓటు వేయకపోవడం వల్లే ఓడిపోయానని అందుకు కారణం మీరేనని స్పష్టం చేసినట్లు భాధితురాలు ఆరోపించింది. తమకు న్యాయం చేయాలని బాధితులు పలుమార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, అధికారులు వచ్చి పిలిచినా మాజీ సర్పంచు విజయలక్ష్మి నుంచి ఎలాంట సమాధానం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమకు కేటాయించిన 35 గుంటల పొలంలో కాస్తులో ఉన్నామని, రూ.2 లక్షల ఖర్చు చేసి పొలాన్ని చదును చేసుకున్నామని వాపోయారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకోంటున్నారు.

డీఆర్‌డీఓ ఆదేశాల మేరకు..

అప్పట్లో వ్యవసాయ పొలాన్ని పంపిణీ చేసే క్రమంలో బాధితురాలు రుక్కమ్మ తన వంతుగా పొలం కొనుగోలు కోసం రూ.7,100 చెల్లించిన రశీదు పరిశీలించాలని డీఆర్‌డీఓ పీడీ ఆదేశించారు. దీంతో గురువారం గ్రామ సంఘం సమావేశం నిర్వహించి రుక్కమ్మతో పాటు అప్పటి సభ్యుల వివరాలను తెలుసుకున్నాం. అందుకు సంబంధించిన నివేదికను జిల్లా అధికారులకు సమర్పిస్తాం.

– వెంకటప్ప, ఏపీఎం, అమరచింత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement