అచ్చంపేట: వేసవిలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో అడవుల్లో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలను గుర్తించి వాగులు, వంకలు, ఊటకుంటలు, చెలిమెలు, చెక్‌డ్యాంలు, నీటి గుంటలు, సోలార్ కుంటలు, సాసర్ పిట్‌లు నిర్మించారు. సోలార్ పిట్‌లలో ప్రతి నాలుగు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపి వన్యప్రాణుల దాహార్తి తీర్చుతున్నారు. ప్రతిఏటా ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈసారి ఎండలు మరింత ఎక్కువగా ఉండటంతో సమస్య జటిలమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో దాహం తీర్చుకునేందుకు పంట పొలాలు, నీటి ఆవాసాల వైపు వస్తున్న వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. వాటి సంరణకు చర్యలు చేపడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. దాహం తీర్చడంతో పాటు వాటి మనుగడకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.
జంతువుల ఆవాసాల్లోనే..
అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం 2,611.39 చ.కి.మీ., విస్తరించి ఉంది. ఇందులో 2,166.37 చ.కి.మీ., అభయారణ్యం కాగా.. 445.02 చ.కి.మీ., బఫర్‌జోన్‌గా ఉంది. నేషనల్ టైగర్ కన్జర్వేటర్ (ఎన్జీసీఏ) లెక్కల ప్రకారం ప్రస్తుతం 42 పులులు, 250కిపైగా చిరుతలతో పాటు ఎలుగుబంట్లు, అడవి పందులు, మచ్చల జింకలు, దుప్పులు, మనుబోతులు, ముళ్లపందులు, నక్కలు, తోడేళ్లు, కొండ గొర్రెలు, కుందేళ్లు, నెమళ్లు, వంటి ఇతర వన్యప్రాణులు ఉన్నాయి. వీటితోపాటు అరుదైన వివిధ రకాల పక్షులు, సర్పాలు, కీటకాలు, వృక్ష సంపద నల్లమల సొంతం. ప్రతిఏటా వన్యప్రాణుల సంతతి గణనీయంగా పెరుగుతోంది. నీటి సమస్య తీవ్రతతో అటవీ జంతువుల ఇబ్బందులు వర్ణణాతీతం. జంతువులు సాధారణంగా ఆహార అన్వేషణలో భాగంగా 4 కి.మీ., పరిధిలో తిరుగుతాయి. నల్లమలను అనుసరించి 140 కి.మీ., పరిధిలో కృష్ణానది ప్రవహిస్తుంది. అటవీ ప్రాంతంలో నిరంతరం నీళ్లు ఉండే సహజ జలవనరుల దగ్గర ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసులచెరువులో మాత్రమే కొద్దిగా నీరు ఉండటంతో అత్యధికంగా వన్యప్రాణులు ఇక్కడికి వస్తుంటాయి.
1,150 సీసీ సాసర్ల ఏర్పాటు
నీటికుంటలు, సోలార్ పంపులు, ర్యాంపువెల్స్ లేని ఎత్తైన ప్రాంతాల్లో 1,150 సీసీ సాసర్లు ఏర్పాటు చేశారు. వీటిలో ట్యాంకర్ ద్వారా నీరు నింపి వన్యప్రాణులకు అందిస్తారు. బేస్‌క్యాంపు సిబ్బంది, బీట్ అధికారులు నాలుగు రోజులకోసారి సాసర్లు నింపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏటీఆర్(అమ్రాబాద్ టైగర్‌రిజర్వ్)లో 75 సోలార్ విద్యుత్‌తో నడిచే పంపుల ద్వారా నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఏటీఆర్ పరిధిలో 80 వరకు నీటికుంటలు, చెక్‌డ్యాంలు, పర్కులేషన్ ట్యాంక్‌లు, పాంపాండ్లు ఏర్పాటు చేశారు. నీటి ఊట ఉన్న ప్రదేశంలో బావిలా గుంత తవ్వి నీరు పడగానే వన్యప్రాణులు సులువుగా దిగి నీరు తాగేలా రెండువైపుల ర్యాంపు తయారు చేస్తారు. మూడు మీటర్ల లోతు, పది మీటర్ల వెడల్పుతో గుంత తవ్వుతారు. అందులోకి స్వచ్ఛమైన నీరు ఊటల ద్వారా చేరుతుంది. వీటిని 20 వరకు ఏర్పాటు చేశారు. వీటిని ప్రతి రెండురోజులకోసారి బేస్ క్యాంపు సిబ్బంది, బీట్ అధికారులు పర్యవేక్షిస్తారు.
ఏర్పాట్లు చేస్తున్నాం..
నల్లమలలో వన్యప్రాణులకు ఆహారంతో పాటు దాహార్తి తీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. అడవిలో పారే వాగులు, నీటి వనరులు ఉన్న ప్రదేశాల్లో సోలార్ పంపులు ఏర్పాటు చేశాం. నీటి ఆనకట్టలు, ర్యాంపు వెల్స్, చెలిమెల ద్వారా సహజసిద్ధమైన నీటిని వన్యప్రాణులకు అందించేందుకు చర్యలు చేపట్టాం. సీసీ సాసర్ల వినియోగం తగ్గించి సహజ సిద్ధమైన నీరిందించేందుకు చూస్తున్నాం. కెమెరాల పర్యవేక్షణలో నీరు అయిపోయినట్లు గుర్తించి వెంటనే నింపుతున్నాం.
– రేవంత్‌చంద్ర, డీఎఫ్‌ఓ
నల్లమల అటవీ ప్రాంతంలోమూగజీవాలకు నీటి సౌకర్యం
అభయారణ్యంలో ఎండుతున్నవాగులు, చెక్‌డ్యాంలు, కుంటలు
మండుతున్న ఎండలతో
అడుగంటుతున్న జలాలు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు


