కొండనాగుల సొసైటీకి ఉత్తమ అవార్డు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రైతు సేవలో తరిస్తున్న వివిధ సొసైటీల పనితీరును గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అవార్డులు ప్రకటించింది. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో మొత్తం 8 సింగిల్ విండో సొసైటీలకు రూ.15 లక్షల చొప్పున గ్రాంట్లు విడుదలయ్యాయి. కాగా.. అచ్చంపేట మండలంలోని కొండనాగుల పీఏసీఎస్ కార్యాలయం రైతులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఉత్తమ అవార్డు లభించింది. ఈ మేరకు సింగిల్ విండో కార్యదర్శి రాజవర్ధన్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన 2025 అంతర్జాతీయ సహకార సంవత్సరం కార్యక్రమంలో భాగంగా రాజవర్ధన్‌రెడ్డి ఉత్తమ అవార్డు అందుకున్నారు. సింగిల్ విండో తరపున ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు రుణాల మంజూరులో బాధ్యత వహించి ప్రభుత్వ పథకాల అమలుకు సహకరిస్తూ ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో చూపిన శ్రద్ధకుగాను ఈ అవార్డు లభించినట్లు సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో నాబార్డు సీజీఎం ఉదయ్‌కుమార్, జాయింట్ రిజిస్ట్రార్, కార్యక్రమ సమన్వయకర్త నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.


