వసతి గృహాల కథనంపై స్పందన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం ప్రచురితమైన ‘వణుకుతున్న వసతి గృహాలు’ కథనానికి జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు స్పందించారు. ప్రధానంగా మూసాపేట ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థులు బాత్‌రూంలు వినియోగించకుండా ఉదయం వేళ వాటర్ ట్యాంక్ వద్ద స్నానాలు చేయడానికి కారణాలు, అక్కడ ఉన్న బాత్‌రూంల పరిస్థితిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఏఎస్‌డబ్ల్యూఓను జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి సునీత ఆదేశించారు. అలాగే జిల్లావ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లలో పాడైన మరుగుదొడ్లు, విరిగిన డోర్లు, కిటికీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించి, వినియోగంలోకి తీసుకురావాలని సిబ్బంది ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. చలికాలంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు.


