
మళ్లీ రోడ్డెక్కిన రైతులు
● జిల్లాకేంద్రంతోపాటు భూత్పూర్ చౌరస్తాలో ధర్నా
● యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలం
● మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శ
మహబూబ్‌నగర్ (వ్యవసాయం)/ జడ్చర్ల/ భూత్పూర్: యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. నెల రోజులుగా యూరియా కావాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రైతులు సోమవారం రాస్తారోకో చేపట్టారు. తమకు టోకెన్లు ఇచ్చి యూరియా ఇవ్వకపోవడంతో రైతులు హైదరాబాద్– రాయిచూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మాజీమంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అక్కడికి చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రైతులు పనులు మానేసి యూరియా కోసం తిరుగుతుంటే.. అధికారులు టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని, యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పక్క రాష్ట్రం ఆంధ్రలో కేంద్ర మంత్రులతో మాట్లాడి యూరియా తెచ్చుకుంటున్నారని, ఇక్కడి కేంద్ర మంత్రులు, ఎంపీలు రైతుల గురించి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రూ.40–50 వేలు పెట్టుబడి పెట్టి రైతులు పంటలు సాగు చేస్తే యూరియా లేక నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని అందుబాటులోకి తేవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని, ఇలాగే కొనసాగితే రైతుల పక్షాన పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నారాయణపేట పోలీసులు రైతులను కొట్టారని, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని, రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భూత్పూర్ చౌరస్తాలో రైతులు చేపట్టిన ధర్నాలోనూ వారు పాల్గొని మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, నాయకులు బస్వరాజుగౌడ్, దేవేందర్‌రెడ్డి, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.