
జలాశయాలకు నిలకడగా వరద
● జూరాలకు 1,56,615
క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
● 20 గేట్లు ఎత్తి దిగువకు
1,70,534 క్యూసెక్కులు
● కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ధరూరు/ఆత్మకూర్/మదనాపురం/దేవరకద్ర/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పడుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ప్రాజెక్టుకు 2లక్షల 14వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. సోమవారం సాయంత్రం 7:30 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో లక్షా 56వేల 615 క్యూసెక్కులకు తగ్గినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్టు 20 క్రస్టు గేట్లను ఎత్తి గేట్ల ద్వారా లక్షా 36వేల 240 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుద్పత్తి నిమిత్తం 32వేల 171 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 67 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 920 క్యూసెక్కులు, కుడి కాలువకు 386 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం లక్షా 70వేల 534 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9,657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8,048 టీఎంసీల నిల్వ ఉన్నట్లు తెలిపారు.
శ్రీశైలం నుంచి సాగర్‌కు పరుగులు
ఎగువ ప్రాంతాల నుంచి నీటిప్రవాహం కొనసాగుతుండడంతో శ్రీశైలం ఆనకట్ట వద్ద ఎత్తి ఉంచిన పదిగేట్లు సోమవారం కొనసాగుతున్నాయి. జూరాలలో ఆనకట్ట గేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా 1,36,240, విద్యుదుత్పత్తికి 32,171, సుంకేసుల నుంచి 66,752 మొత్తం 2,35,163 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయం వస్తున్నాయి. శ్రీశైలంలో ఆనకట్ట పదిగేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా 2,67,440 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. మరోవైపు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,288 మొత్తం 65,603 క్యూసెక్కులను అదనంగా సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.1 అడుగుల నీటిమట్టం వద్ద 199.7354 టీఎంసీల నిల్వ ఉంది. 24గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 27,000, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,489 క్యూసెక్కులను విడుదల చేశారు. భూగర్భకేంద్రంలో 16.765 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 15.215 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.
పూర్తిస్థాయి నీటిమట్టానికి రామన్‌పాడు
రామన్‌పాడు జలాశయంలో సోమవారం నాటికి పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా 390 క్యూసెక్కులను వదులుతూ సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 925 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వ ద్వారా 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఊకచెట్టు వాగు, సరళాసాగర్ ద్వారా వరద వస్తుండడంతో ఒక గేటు ఎత్తి 2,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామని ఏఈ వరప్రసాద్ తెలిపారు.
కోయిల్‌సాగర్ గేట్ల బంద్
కోయిల్‌సాగర్ గేట్లను సోమవారం ఉదయం నుంచి మూసి వేశారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గి పోవడంతో ఆదివారం తెరిచిన ఒక గేటును మూసి వేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు ఉండగా ప్రస్తుతం 32అడుగులుగా ఉంది. నీటి సామర్థ్యం 2.27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.2 టీఎంసీల నిల్వ ఉంది.